వంగవీటి రాధాతో వల్లభనేని వంశీ భేటీ.. హీటెక్కిన బెజవాడ రాజకీయం.. మళ్లీ వైసీపీ గూటికి అంటూ ప్రచారం..?.
ఆంధ్రప్రదేశ్ రాజకీయలు రోజుకోక మలుపుతిరుగుతున్నాయి.. అధికార వైసీపీ , ప్రధాన ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాట యుద్ధమే నడుస్తోంది. అయితే బెజవాడ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, టీడీపీ నేత వంగవీటి రాధాను కలిశారు. దీంతో వీరిద్దరి కలయిక రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది.

రాధాతో వంశీ కీలక భేటీ
విజయవాడలోని వంగవీటి రాధా కార్యాలయానికి ఎమ్మెల్యే వంశీ వెళ్లారు. అక్కడ చాలాసేపు వీరిద్దరు పలు అంశాలపై చర్చించుకున్నారు. అంతకు ముందు రాధా, వంశీ కలిసి వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగా వర్థంతి సందర్భంగా చాలా రోజులు తర్వాత వల్లభనేని వంశీ , రాధాను కలవడం బెజవాడలో హాట్ టాఫిక్‌గా మారింది.

రంగా అడుగు జాడల్లోనే..
రాధాను వంశీ మర్యాదపూర్వకంగానే కలిశాడని పలువురు పేర్కొంటున్నారు. తీవ్ర చర్చ మాత్రం జరుగుతోంది. వంగవీటి రంగాకు నివాలర్పించిన తర్వాత రాధా మాట్లాడుతూ తమ కుటుంబాన్ని ఆదరిస్తున్న ప్రజందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రంగా వర్థంతిని గత 33 సంవత్సరాలుగా అభిమానులే చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల కోసం తుది శ్వాస ఉన్నంత వరకు పోరాడిన వ్యక్తి రంగా అని అన్నారు. తన తండ్రి ఆశయాల మరింత ముందుకు తీసుకువెళ్తానని తెలిపారు.
వంశీ కీలక వ్యాఖ్యలు
రంగా వర్థంతిలో పాల్గొన్నవల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తులు ముగ్గురే ముగ్గురు అన్నారు. వారు ఎన్టీఆర్, వైఎస్ఆర్, వంగవీటి రంగా మాత్రమేనని పేర్కొన్నారు. తండ్రి అడుగు జాడలలో నడుస్తూ రాధా కూడా ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు వంశీ పేర్కొన్నారు.

మళ్లీ వైసీపీ గూటికి రాధా..?
అయితే ఈ కలయిక రాధాను తిరిగి వైసీపీలోకి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగమేనన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, వంగవీటి రాధాలు మంచి స్నేహితులు. రాజకీయ పరంగా వేర్వేరు పార్టీలో ఉన్నప్పటికీ తమ స్నేహాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు. అలాగే బయట ఎక్కడా కలసినా, పంక్షన్‌లలో ఎదురుపడినా ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటారు. అయితే తాజాగా వల్లభనేని వంశీ ప్రత్యేకంగా వంగవీటి రాధా కార్యాలయానికి వెళ్లి మరి కలడం బెజవాడలో చర్చనీయాంశానికి దారితీసింది.

టీడీపీకి రాధా గుడ్ బై చెబుతారా.?
గత కొంత కాలంగా రాధా టీడీపీకి గుడ్ బై చెబుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. 2019 ఎన్నికల ముందు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ టీడీపీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమిని చవిచూసింది. తర్వాత రాజకీయాలకు దూరంగానే ఉన్నారు రాధా. పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొన్నది లేదు. అప్పుడప్పుడు మాత్రమే కొన్ని ప్రైవేటు కార్యక్రమాలకు హాజరైయ్యేవారు. అమరావతి రైతుల ఉద్యమంలో పాల్గొని వారికి మద్దతు పలికారు. ఈ ఉద్యమం సమయంలో విజయవాడ పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేశారు. అప్పుడు మాత్రం చంద్రబాబును కలిసి వారికి మద్దతుగా నిలిచారు.

హీటెక్కిన బెజవాడ రాజకీయం..
అయితే ఇటీవల వచ్చేఎన్నికల్లో వంగవీటి రాధా గుడివాడలో పోటీ చేయబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. మంత్రి కొడాలి నానిపై రాధాను బరిలోకి దింపుతున్నారంటూ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కూడా జరిగింది. అందుకే గుడివాడలో కాపు సామాజిక వర్గం నేతలతో రాధా ప్రత్యేకంగా సమావేశం అయ్యారంటూ వార్తలు వచ్చాయి.
అయితే దానికి చెక్ పెట్టేలా.. ఒక పెళ్లి కార్యక్రమంలో కొడాలినాని, వంగవీటి రాధా కలుసుకున్నారు. ప్రత్యేకంగా సమావేశమైయ్యారు. దీంతో గుడివాడలో రాధా పోటీ చేస్తాడంటూ వచ్చిన ప్రచారానికి చెక్ పడింది. ఇప్పడు తాజాగా వల్లనేని వంశీ, రాధా కలవడంతో మరో సారి రాజకీయ వర్గల్లో చర్చకు తెరతీసింది. మరి వచ్చే ఎన్నికల్ల నాటికి రాధా ఏ రాజకీయ పార్టీ వైపు తన పయనం సాగిస్తారో చూడాలి..












Click it and Unblock the Notifications