విజయవాడ రైల్వేస్టేషన్‌కు వరాన్ని ప్రకటించిన నరేంద్రమోడీ
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ రైల్వేస్టేషన్ కు అరుదైన గుర్తింపు లభించింది. ఈ స్టేషన్ ఎన్ఎస్‌జీ-1 హోదా దక్కించుకుంది. దేశంలో ఉన్న టాప్-28 రైల్వేస్టేషన్ల ఎలైట్ జాబితాలో పేరు సంపాదించుకుంది. దక్షిణ మధ్య రైల్వేపరిధిలో సికింద్రాబాద్ తర్వాత ఈ హోదా దక్కించుకున్న ఏకైక స్టేషన్ విజయవాడ కావడం గమనార్హం. ఎన్ఎస్‌జీ-1 హోదాను రూ.500 కోట్ల వార్షికాదాయం దాటిని రైల్వేస్టేషన్లకు లేదంటే రెండు కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించే స్టేషన్ కు ఇస్తారు.
గతంలో త్రుటిలో కోల్పోయింది
భారతీయ రైల్వే ఈ విధానాన్ని 2017-18 సంవత్సరంలో తీసుకువచ్చింది. అప్పట్లో త్రుటిలో ఈ అవకాశాన్ని బెజవాడ స్టేషన్ కోల్పోయింది. ఐదు సంవత్సరాల తర్వాత మళ్లీ ఎన్ఎస్‌జీ-1 స్టేషన్లపై సమీక్ష చేయగా రూ.528 కోట్ల ఆదాయంతో చోటు సంపాదించుకుంది. వాణిజ్యపరంగా, ప్రయాణికులద్వారా ఈ స్టేషన్ కు అత్యధిక ఆదాయం వస్తుంది. కీలకమైన చెన్నై-న్యూఢిల్లీ, చెన్నై-కోల్ కతా మార్గంతోపాటు మచిలీపట్నం, నర్సాపూర్, గుంటూరు, గుంతకల్లు, కర్నూలు మీదగా బెంగళూరు చేరుకునే వెసులుబాటు విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి ఉంది. మనదేశంలో అత్యధిక రద్దీ ఉండే స్టేషన్ తోపాటు దేశంలో అతిపెద్ద రైల్వే జంక్షన్ గా కూడా పేరు తెచ్చుకుంది.

విశాఖ మార్గంలో మూడోలైను నిర్మాణం
విజయవాడ నుంచి విశాఖపట్నం మార్గం అత్యంత రద్దీగా ఉంటుంది. దీన్ని నివారించేందుకు ఈ మార్గంలో మూడో రైల్వేలైను నిర్మాణం జరుగుతోంది. అలాగే మరో రద్దీ మార్గమైన విజయవాడ-గూడూరు మార్గంలో కూడా మూడో రైల్వే లైను నిర్మాణం జరుగుతోంది. ఇవి అందుబాటులోకి వస్తే ఏ రైలును క్రాసింగ్ కోసం ఇతర స్టేషన్లలో నిలపాల్సిన అవసరం ఉండదు. అలాగే విశాఖపట్నం నుంచి కర్నూలు వరకు హైస్పీడ్ రైలు మార్గం ఏర్పాటు చేసేందుకు సర్వే జరుగుతోంది. ప్రస్తుతం విజయవాడ, గుంటూరు రైల్వే జంక్షన్ల నుంచి రైళ్ల రాకపోకలు చాలా ఎక్కువగా ఉండటంతో భారతీయ రైల్వేలో ఇవి అత్యంత కీలకంగా మారాయి.












Click it and Unblock the Notifications