ఏపీ సర్కార్ కు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల తాజా డిమాండ్లు..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో వైసీపీ ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సచివాలయాల ప్రక్షాళన, ఉద్యోగుల హేతుబద్ధీకరణ కోసం ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఈ ప్రక్రియ పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇవాళ ప్రభుత్వం ముందు కీలక డిమాండ్లు పెట్టారు.
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు వారు ఉద్యోగంలో చేరిన తేదీ నుంచి నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని వారు కోరారు. అలాగే తక్షణం బదిలీలు చేపట్టాలని కోరారు. ఇలా పలు అపరిష్కృత సమస్యలపై డైరెక్టర్ కు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మ రావు
తొమ్మిది అంశాలతో కూడిన వినతిపత్రం అందించారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్ నుండి జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కు అప్ గ్రేడ్ చేయాలని డైరెక్టర్ ను వారు కోరారు.

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఉద్యోగంలో చేరిన తేదీ నుంచి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడంతో పాటు ప్రస్తుతం ఉన్న రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్ ను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కు అప్ గ్రేడ్ చేయాలని, తొమ్మిది నెలలు ఆలస్యంగా ప్రొబేషన్ డిక్లేర్ చేసిన తేదీ కాకుండా ప్రొబేషన్ డిక్లరేషన్ తేదీని రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన రోజుకు మార్పు చేయాలని కోరారు. అలాగే ఆలస్యం అయిన 9 నెలల కాలానికి బకాయిలు చెల్లించాలని కోరారు.
అన్నీ జిల్లాల్లో అన్ని విభాగాల సచివాలయ ఉద్యోగుల సీనియారిటీ జాబితాలు మెరిట్ కం రోస్టర్ విధానంలో ప్రదర్శించాలని కూడా వారు కోరారు. ఉద్యోగుల పదోన్నతులలో పే స్కేల్స్ లో ఏర్పడుతున్న అసమానతలు తొలగించాలని మరో వినతి చేశారు. సచివాలయ ఉద్యోగులను అవకాశం ఉన్న మేరకు అర్హత ప్రకారం ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేయాలని కోరారు. సచివాలయ ఉద్యోగులకు తక్షణం బదిలీ చేయాలని, సాధారణ బదిలీలతో పాటు అంతర్ జిల్లా బదిలీలు కల్పించాలని కోరారు.

సచివాలయ ఉద్యోగులకు సబ్సిడీతో ఇళ్ళ స్థలాలు కేటాయించాలని, ఉద్యోగులకు గ్రూప్ మెడికల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని కూడా కోరారు. అలాగే మున్సిపాలిటీలుగా మారిన గ్రామాలలోని సచివాలయ ఉద్యోగులు మునిసిపల్ ఆప్షన్ ఎంచుకున్నవారికి బదిలీలలో మినహాయింపు లేదా మున్సిపాలిటీలకు అవకాశం కల్పించాలని కోరారు.












Click it and Unblock the Notifications