పంచకర్ల రమేష్ బాబు రాజీనామా - ఎమోషనల్..!!
విశాఖ వైసీపీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు పార్టీకి రాజీనామా చేసారు. పెందుర్తి టికెట్ విషయంలో హామీ దక్కనందుకే రాజీనామా చేసారని ప్రచారం సాగుతోంది. ఎన్నికల ముందు రమేష్ బాబు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. ఏడాది పాటు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పని చేసారు. రాజీనామా సమయంలో రమేష్ బాబు ఎమోషనల్ అయ్యారు. తనకు పార్టీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ సుబ్బారెడ్డితో విభేదాలు లేవని రమేష్ బాబు స్పష్టం చేసారు.
వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా విషయమై పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయానని క్షమించమంటూ వేడుకున్నారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి.. పార్టీకి రాజీనామా చేస్తున్నానని.. బాధగా ఉందన్నారు. ఏడాది కాలంగా ఎన్నో సమస్యలు సీఎం జగన్ దృష్టి కి తీసుకుని వెళ్ళాలని ప్రయత్నించినట్టు తెలిపారు. కానీ వీలు కాలేదన్నారు. ప్రజా సమస్యలు, కింది స్థాయిలో తీర్చ లేనప్పుడు ఈ పదవిలో ఉండటం, సమంజసం కాదని రాజీనామా చేస్తున్నానన్నారు. త్వరలో తన అనుచరులతో సమావేశమై... భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకుంటానని రమేష్ బాబు తెలిపారు.

పంచకర్ల రమేష్ బాబు 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ప్రజారాజ్యం నుంచి పెందుర్తి నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైంది. ఇక రాష్ట్ర విభజన అనంతరం రమేష్ బాబు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. 2014 ఎన్నికల సమయంలో గంటా శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్‌తో పాటు టీడీపీలో చేరారు. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ తరుఫున ఎలమంచిలి నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం ఆగస్ట్ 2020లో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఇక ప్రస్తుతం వైసీపీకి కూడా రాజీనామా చేశారు. ఇక మీదట ఆయన పయనం ఎటు వైపు అనేది తేలాల్సి ఉంది. జిల్లాలో సీట్ల ఖరారులో భాగంగా రమేష్ బాబు పెందుర్తి సీటును ఆశించారు. ఆ సీటుపైన హామీ దక్కని కారణంగా పార్టీని వీడుతున్నారనే ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications