జీవితాంతం అండగా ఉంటాం.. ధైర్యం చెప్పిన లోకేష్
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాద బాధితులను, వారి కుటుంబాలను పరామర్శించేందుకు అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల యంత్రాంగం కదిలివచ్చింది. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు.
మంత్రి నారా లోకేష్‌తో పాటు కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి సంధ్యారాణి, విశాఖ ఎంపీ శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, చింతకాయల విజయ్ తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.

కేజీహెచ్‌లో మృతుల కుటుంబాలకు ఓదార్పు
మంత్రి నారా లోకేష్ బృందం తొలుత విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రిని (KGH) సందర్శించింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను లోకేష్ వ్యక్తిగతంగా కలిసి పరామర్శించారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనే వివరాలను బాధితుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో గుండె నిబ్బరం కలిగి ఉండాలని మృతుల కుటుంబాలకు ధైర్యం చెప్పారు.
బాధితులకు జీవితాంతం అండగా నిలబడతామని, కూటమి ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. అందరం కలిసి పోరాడటం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోగలిగామని గుర్తుచేసిన ఆయన, ఈ ఘోర ప్రమాదంపై కమిటీ నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో క్షతగాత్రుల పరామర్శ
అనంతరం మంత్రుల బృందం విశాఖలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రికి చేరుకుంది. అక్కడ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఐసీయూలో (ICU) ప్రాణాలతో పోరాడుతున్న సూరిబాబు, పైడిరాజు, పి.శ్రీనివాసరావులను పరామర్శించారు. బాధితులకు అందుతున్న అత్యవసర చికిత్స వివరాలను, వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఆ తర్వాత ఐసీయూ వెలుపల వేచి ఉన్న వారి కుటుంబ సభ్యులను హోంమంత్రి వంగలపూడి అనిత, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మలతో కలిసి మంత్రి లోకేష్ ఓదార్చారు. బాధితుల వైద్య ఖర్చుల విషయంలో వెనకాడబోమని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ప్లాంట్‌లో కఠినమైన భద్రతా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
కిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యానికి ఆదేశాలు
పర్యటనలో భాగంగా మంత్రులు, ఎంపీల బృందం విశాఖ కిమ్స్ (KIMS) ఆసుపత్రిని కూడా సందర్శించింది. అగ్నిప్రమాదంలో గాయపడి ఇక్కడ చికిత్స పొందుతున్న ఆర్.మల్లికార్జునరావు, గుడివాడ అర్జున అప్పారావు, బి.సత్యానందల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు ఎలాంటి లోటు లేకుండా అత్యంత మెరుగైన వైద్య సేవలను అందించాలని, అవసరమైతే ప్రత్యేక నిపుణులను రంగంలోకి దించాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని, వైద్యులను మంత్రి లోకేష్ ఆదేశించారు. అనంతరం అక్కడి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి.. ప్రభుత్వం బాధితుల వెంటే ఉంటుందని గట్టి భరోసా ఇచ్చారు.














Click it and Unblock the Notifications