
కేంద్రం దిగొచ్చే వరకు విశాఖ ఉక్కు ఉద్యమం ; ఢిల్లీలో హోరెత్తుతున్న మహాధర్నాలో వైసీపీ, టీడీపీ ఎంపీలు
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా రెండో రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ ఢిల్లీలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నిరసనలో భాగంగా ఈరోజు ఏపీ భవన్ వద్ద వివిధ కార్మిక సంఘాల నేతృత్వంలోధర్నా చేపట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడాలని, తమని రోడ్డున పడేయవద్దు అంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. విశాఖ ఉక్కుని కాపాడాలని డిమాండ్ చేశారు.

రెండో రోజు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల కు మద్దతుగా వైసీపీ ఎంపీలు
రెండో రోజు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక లోకానికి మద్దతుగా వైసిపి ఎంపీలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పెద్ద ఎత్తున పోరాటం చేయాలని, అధికార వైసీపీ కూడా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవివి సత్యనారాయణ, గీత, మార్గాని భరత్, సత్యవతి, మాధవ్, కోటగిరి శ్రీధర్, అనురాధ, తలారి రంగయ్య తదితరులు స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు.

అవసరమైతే న్యాయ పోరాటం చేసినా ప్రైవేటీకరణ అడ్డుకుందాం : వైసీపీ ఎంపీ సాయిరెడ్డి
ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమం మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. అవసరమైతే న్యాయ పోరాటం చేసైనా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని ఆయన స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు ఇవ్వాలని, అప్పును ఈక్విటీ గా మార్చాలని సూచించామని దానికి ఇప్పటికే అనేక మార్లు విజ్ఞాపనలు చేశామని చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి స్టీల్ ప్లాంట్ ను ఉద్యోగుల యాజమాన్యంలో ఉంచితే బావుంటుందని తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం సాగుతున్న ఉద్యమానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి అండగా ఉంటారని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు టిడిపి మొదటి నుండి వ్యతిరేకమన్న టిడిపి ఎంపీలు
ఇదిలా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను మొదటినుంచి టిడిపి వ్యతిరేకిస్తుందని టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కింజారపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఢిల్లీ వేదికగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న మహాధర్నాలో పాల్గొన్న వారు ఏపీ భవన్ వద్ద కార్మిక లోకానికి సంఘీభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాలకు ముందే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవటం కోసం అవసరం అయితే రాజీనామాలకు కూడా సిద్ధమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.

స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరింస్తామంటే ఊరుకునేది లేదన్న టిడిపి ఎంపీ కేశినేని నాని
టీడీపీ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం చాలా బాధాకరమని, ఈ నిర్ణయంతో 32 వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు ఇబ్బంది పడతాయని వెల్లడించారు. కార్మికులు, ప్రజల సంపద విశాఖ ఉక్కు అని దానిని ప్రైవేటీకరణ చేస్తామంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు టిడిపి పూర్తిగా వ్యతిరేకమని ఎంపీ కేశినేని నాని వెల్లడించారు. పార్లమెంటులో దీనిపై పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో అన్ని పార్టీలతో కలిసి టిడిపి ముందుకు వెళుతుందని కేశినేని నాని పేర్కొన్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం మార్చుకోవాలని డిమాండ్ చేసిన ఎంపీ రామ్మోహన్ నాయుడు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం మార్చుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నాటకాలు ఆడడం మానేసి కేంద్రంపై నిజమైన ఒత్తిడి తీసుకురావాలని ఇప్పటికే అనేక పర్యాయాలు చెప్పిన ఎంపీ రామ్మోహన్ నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం సంయుక్తంగా కలిసి పోరాడుతామని, కార్మికుల పక్షాన నిలబడతామని స్పష్టం చేశారు .

పార్లమెంటులో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్రం
ఇదిలా ఉంటే కేంద్రం మాత్రం ఎవరెన్ని ఆందోళనలు చేసినా, కోర్టు మెట్లెక్కినా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మార్చుకుని లేదని స్పష్టం చేసింది స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడం అని తేల్చి చెబుతోంది. విశాఖ ఉక్కు కర్మాగారం నమ్మేసే విషయంలో వెనక్కుతగ్గే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తోంది. నిన్నటికి నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్ పై లోక్ సభలో వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి కిషన్ రావు కరాడ్ సమాధానమిచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ప్రతిపాదన ఏదీ లేదని తేల్చి చెప్పారు.

ఢిల్లీలో కొనసాగుతున్న మహా ధర్నా.. ప్రైవేటీకరణ ఆపేవరకు ఉద్యమం
ఒకపక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఢిల్లీలో జరుగుతున్న మహాధర్నాలో వామపక్ష నేతలు వైసీపీ, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్టీల్ ప్లాంట్ జేఏసీ నేతలు, ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియు, సిపిఐ, సిపిఎం, ఏఐకెఎస్, ఏఐఏడబ్ల్యుయు, ఐద్వా నేతలు కూడా పాల్గొంటున్నారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు విశాఖ ఉక్కు ఉద్యమం ఆగదని స్పష్టం చేస్తున్నారు.