విశాఖ యువతకు ఎగిరి గంతేసే వార్త.. త్వరలో 16 కొత్త ఫైవ్ స్టార్ హోటళ్లు!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ నగర అభివృద్ధిపైన ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఉత్తరాంధ్ర ప్రగతికి కట్టుబడి పని చేస్తున్న సర్కార్ భారీగా పెట్టుబడులను విశాఖకు ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో తాజాగా విశాఖపట్నం నగరంలో త్వరలోనే 16 కొత్త ఫైవ్ స్టార్ హోటళ్లు నిర్మాణం పూర్తయి అందుబాటులోకి రానున్నాయని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.
ఎంఎస్ఎంఈ బిజినెస్ ఎక్స్‌పో 2026 ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టుల ద్వారా స్థానిక యువతకు వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం వేగవంతం కావడం, విశాఖ ఎకనామిక్ రీజియన్‌లో కార్పొరేట్ కార్యకలాపాలు పెరగడంతో లగ్జరీ వసతి గృహాలకు డిమాండ్ పెరిగిందన్నారు.

ఈ క్రమంలోనే విశాఖ నుంచి భోగాపురం వరకు సాగర తీరం వెంబడి జాతీయ, అంతర్జాతీయ స్టార్ హోటల్ బ్రాండ్లు తమ ప్రాజెక్టులను నిర్మాణం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇవి అందుబాటులోకి వస్తే దీనితో దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరగనుండటంతో పాటు, నగరం గ్లోబల్ కాన్ఫరెన్స్‌లు, ఎగ్జిబిషన్లు, డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు ప్రధాన కేంద్రంగా మారనుంది. అంతేకాదు స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు .
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, రాబోయే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో రూ.50 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయటానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మైక్రో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసి స్టార్టప్‌లను ప్రోత్సహిస్తామని భరోసా ఇచ్చారు.
స్థానిక యువ పారిశ్రామికవేత్తలకు భూమి, మౌలిక వసతులు, బ్యాంక్ లింకేజీలు అందజేస్తామని తెలిపారు.గాదిరాజు ప్యాలెస్‌లో జరుగుతున్న ఈ ఎక్స్‌పోలో పారిశ్రామిక, వ్యవసాయ, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్, గ్రీన్ ఎనర్జీ తదితర రంగాలకు సంబంధించి ప్రత్యేక పెవిలియన్లు ఏర్పాటు చేశారు. వ్యాపార సంస్థల మధ్య భాగస్వామ్యాలు, ప్రభుత్వ సమన్వయం కోసం సమావేశాలు నిర్వహిస్తున్నారు.














Click it and Unblock the Notifications
