అవినాశ్ తల్లి ఆరోగ్యంపై వైద్యుల కీలక ప్రకటన - అక్కడే సీబీఐ అధికారుల మకాం..!!
కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి కేంద్రంగా హై టెన్షన్ కొనసాగుతోంది. అక్కడే ఎంపీ అవినాశ్ తల్లి లక్ష్మీ చికిత్స తీసుకుంటున్నారు. తల్లితో పాటుగా ఎంపీ అవినాశ్ ఆస్పత్రిలోనే ఉన్నారు. వరుసగా రెండు సార్లు విచారణకు అవినాశ్ గైర్హాజరు కావటంతో ఈ రోజున విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. కానీ, అవినాశ్ తాను హాజరు కాలేనని చెబుతూ పది రోజుల సమయం కోరారు. ఈ సమయంలో కర్నూలులోని ఆస్పత్రి వద్దకు సీబీఐ చేరుకుంది. ఈ సమయంలోనే ఆస్పత్రి అవినాశ్ తల్లి హెల్త్ బుటెటిన్ విడుదల చేసింది.
హెల్త్ బులెటిన్ విడుదల : కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు ప్రకటించారు. చికిత్స తీసుకుంటున్న శ్రీలక్ష్మీని ఈ నెల 19న కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో చేరారు. అదే రోజున విచారణ కు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఆ సమయంలోనే తన తల్లి అనారోగ్యం పైన సమాచారం రావటంతో తాను విచారణ కు హాజరు కావటం లేదని అవినాశ్ తన లాయర్ల ద్వారా సీబీఐ కి సమాచారం ఇచ్చారు. దీంతో తిరిగి ఈ రోజు విచారణకు రావాలని సీబీఐ కోరింది. తన తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. విచారణకు పది రోజుల సమయం కావాలని కోరుతూ లేఖ రాసారు.ఈ సమయంలో రెండు టీంలుగా కర్నూలు చేరుకున్న సీబీఐ అధికారులు ఆస్పత్రిలో వైద్యులతో సమావేశమయ్యారు. తాజా పరిణామాల నేపథ్యంలో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసారు.

ఆందోళన కరంగా ఉంది : అవినాశ్ తల్లికి ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (హార్ట్ అటాక్) ఉందని వైద్యులు వెల్లడించారు. యాంజియోగ్రామ్ లో రెండు నాళాలు దెబ్బ తిన్నట్లుగా గుర్తించామని చెప్పారు. ఆస్పత్రిలో ని ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ యూనిట్ లో ఉన్నారని వెల్లడించారు. ఆమె రక్తపోటు ఇప్పటికీ తక్కువగా ఉందని, ఆమె అయానోట్రోపిక్ సపోర్ట్‌లో ఉన్నారని వివరించారు. ప్రస్తుతం ఆమెకు వాంతులు వచ్చాయి,ఆమె నోటి తీసుకోవడం తగ్గిందని పేర్కొన్నారు. వాంతులు కొనసాగితే, మేము అల్ట్రాసౌండ్ ఉదరం,మెదడు ఇమేజింగ్ ప్లాన్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. బిపి తక్కువగా ఉన్నందున ఆమెకు మరికొన్ని రోజులు ఐసియులో ఉండవలిసిన అవసరం ఉందని వైద్యులు స్పష్టం చేసారు.
సీబీఐ ఏం చేయబోతోంది : అవినాశ్ తల్లి ఆరోగ్య పరిస్థితుల పైనా సీబీఐ అధికారులు వైద్యులతో చర్చించారు. ఈ సమయంలోనే వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేసారు. పరిస్థితి ఆందోళన కరంగా ఉందని చెప్పటంతో పాటుగా మరి కొద్ది రోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సిన అవసరం ఉందని చెప్పటంతో సీబీఐ అధికారుల నిర్ణయం కీలకంగా మారుతోంది. తన తండ్రి జైళ్లో ఉండటంతో, తన తల్లి కోసం తాను ఉండాల్సిన అవసరం ఉందని సీబీఐకి అవినాశ్ వివరించారు. ఇదే సమయంలో కర్నూలు జిల్లా ఎస్పీతోనూ సీబీఐ అధికారులు చర్చలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలి వస్తున్న సమయంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇప్పుడు సీబీఐ ఏం చేస్తుందనేది ఉత్కంఠను పెంచుతోంది.












Click it and Unblock the Notifications