స్టీల్ ప్లంట్ పై కేంద్రం కీలక ప్రకటన - జగన్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్..!!
విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ వేదికగా కొద్ది రోజులుగా కొత్త రాజకీయం మొదలైంది. ప్లాంట్ బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనాలని నిర్ణయించింది. ఈ సమయం లో ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా విపక్షాలు విమర్శలు ప్రారంభించాయి. జగన్ ప్రభుత్వం తాము ప్రయివేటకరణకు వ్యతిరేకమని స్పష్టం చేస్తోంది. ఇదే సమయంలో ప్రధానితో సహా కేంద్రానికి ఇచ్చిన నివేదికలను ప్రస్తావిస్తోంది. ఈ సమయంలోనే కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేసారు.
ప్రయివేటీకరణ పై తాజా నిర్ణయం: గత రెండేళ్ల కాలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం సాగుతోంది. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించాలని కేంద్రం నిర్ణయించింది. ఆ జాబితాలో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఉంది. ప్లాంట్ ప్రయివేటీకరణను అన్ని పార్టీలు వ్యతిరేకించాయి. సీఎం జగన్ ఇదే అంశం పైన ప్రధానికి లేఖలు రాసారు.
అసెంబ్లీలో తీర్మానం చేసారు. అఖిలపక్షంతో కలిసేందుకు సమయం ఇవ్వాలని ప్రధానిని కోరారు. తాజాగా స్టీల్ ప్లాంట్ లో బిడ్ దాఖలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో, రాజకీయంగా వైసీపీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెరిగింది. ఈ సమయంలోనే కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశం పైన విశాఖ వేదికగా తమ తాజా నిర్ణయం వెల్లడించింది.

ప్రస్తుతానికి ముందుకు వెళ్లం: కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ విశాఖ వచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం పై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని స్పష్టం చేసారు. దానికంటే ముందు అర్ ఎన్ ఐ ఎల్ ను బలోపేతం చేసే పనిలో ఉన్నామని వెల్లడించారు.
పూర్తి స్థాయి సామర్ధ్యం మేరకు ప్లాంట్ పని చేసే ప్రక్రియ జరుగుతోందని స్పష్టం చేసారు. వీటిపై అర్ ఐ ఎన్ ఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడం ఒక ఎత్తుగడ మాత్రమేనని వ్యాఖ్యానించారు. దీని ద్వారా ప్రయివేటకరణ నిర్ణయం ప్రస్తుతానికి నిలిచినట్లుగా భావిస్తున్నారు. ప్రస్తుతం ముందుకు వెళ్లటం లేదని కేంద్ర సహాయ మంత్రి చెప్పటం ద్వారా స్టీల్ ప్లాంట్ కార్మికులకు బిగ్ రిలీఫ్ గా మారనుంది

క్రెడిట్ దక్కేదెవరికి: తాజాగా కేంద్ర మంత్రి ప్రకటనతో స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ తాత్కాలికంగా నిలిచిపోయినట్లుగా కార్మిక సంఘాల నేతలు భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం బిడ్ లో పాల్గొనాలని నిర్ణయించటం ద్వారా కేంద్రం ఇప్పుడు ఈ ప్రకటన చేసిందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం వరుసగా కేంద్రంతో, స్వయంగా ప్రధానితో చేసిన సంప్రదింపుల కారణంగానే కేంద్రం పునరాలోచన చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశంలో పూర్తిగా తమ నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రి చేసిన తాజా వ్యాఖ్యలతో స్టీల్ ప్లాంట్ విషయంలో కొత్తగా క్రెడిట్ గేమ్ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో కేంద్రం పూర్తి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications