ఏపీలో నేడే పోలింగ్ ఆరంభం ..!
Vote from Home: ఏపీలో ఎన్నికలు ఆరంభం అయ్యాయి. ఈ నెల 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగాల్సి ఉండగా.. సరిగ్గా 10 రోజులు ముందుగానే దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలైంది. ఓట్ ఫ్రమ్ హోమ్ ప్రాసెస్ నేడు ఆరంభమైంది. వయోధిక వృద్ధులు ఇంట్లో నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు.
అలాగే- సర్వీస్ ఓటర్లు కూడా నేటి నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ కేంద్ర ఎన్నికల కమిషన్ పూర్తి చేసింది. 85 సంవత్సరాలు, అంతకు మించి వయస్సు గల వయోవృద్ధులకు పోలింగ్ కేంద్రం వరకూ వెళ్లకుండా ఇంట్లో నుంచే ఓటు వసే అవకాశాన్ని ఈసీ కల్పించిన విషయం తెలిసిందే.

అలాగే- 40 శాతం, అంతకంటే పైగా అంగ వైకల్యం గల దివ్యాంగులు కూడా ఇంటి నుంచే ఓటు వేయవచ్చు. పోలింగ్ సిబ్బంది సదరు ఓటరు ఇంటి వద్దకే వచ్చి ఓటు వేయించుకుంటారు. నిబంధనలకు అనుగుణంగా ఓ కంపార్ట్‌మెంట్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌ను తెస్తారు. రహస్యంగానే తమ ఓటు వేయవచ్చు.
తమ వయస్సును నిర్ధారించడానికి, 40 శాతం మేర అంగవైకల్యం ఉన్నట్లు ధృవీకరణ పత్రాలను పోలింగ్ సిబ్బందికి చూపించాల్సి ఉంటుంది. 28,000 మందికి పైగా వయోధిక వృద్ధులు, దివ్యాంగులు ఇంట్లో నుంచే ఓటు వేయడానికి తమ పేరును నమోదు చేసుకున్నారు. వారంతా నేటి నుంచి ఓటు వేస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా 67,000 మందికి పైగా సర్వీస్ ఓటర్లు ఉన్నారు. వారందరికీ కూడా ఎలక్ట్రానిక్ బ్యాలెట్లను పంపించారు. మొత్తంగా 95 వేల మందికి పైగా వయోధిక వృద్ధులు, దివ్యాంగులు, సర్వీస్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారి కోసం 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.
మరోవంక- రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతమైంది. అన్ని పార్టీలు ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తేల్చుకోనున్నాయి. ఈ నెల 29వ తేదీ నాటితో నామినేషన్ల ప్రక్రియ మొత్తం ముగిసింది. మే 13వ తేదీన పోలింగ్. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకరవర్గాలకు ఒకే రోజున పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. జూన్ 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.
పోలింగ్ గడువు దగ్గర పడుతోండటం అన్ని పార్టీలు కూడా జనంలోకి చొచ్చుకెళ్తోన్నాయి. ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాయి. 2019 నాటి ఎన్నికల్లో సాధించిన పట్టును నిలుపుకోవడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను రూపొందించుకుంది. అప్పటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications