బనకచర్లపై రంగంలోకి దిగిన వాప్కోస్.. కేంద్రం మొగ్గు ఎటువైపు.. ఉత్కంఠ!
బనకచర్ల ప్రాజెక్టు.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని తెలంగాణ రాజకీయ పార్టీలు, బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న నష్టమేమీ లేదని ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వర్గాలు హోరాహోరీగా పోరు చేస్తున్నాయి. ఇక బనకచర్ల ప్రాజెక్టు నేపథ్యంలో కేంద్రానికి కూడా అభ్యంతరాలు, విజ్ఞాపనలు వెల్లువగా మారాయి.
బనకచర్ల ప్రాజెక్ట్ పై అధ్యయనానికి రంగంలోకి వాప్కోస్
ఈ క్రమంలో రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వాప్కోస్ పోలవరం బనకచర్ల అనుసంధాన పథకానికి గోదావరి వరద జలాల అందుబాటు పైన అధ్యయనం ప్రారంభించింది. దీనికోసం వాప్కోస్ ఉన్నతాధికారి శంభునాథ్ అజాద్ నేతృత్వంలో అధికార బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తోంది. వెలగపూడి లోని సచివాలయంలోని జలవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు తో ఈ బృందం సమావేశమై పలు వివరాలను సేకరించింది.

కేంద్ర జలసంఘానికి నివేదిక ఇచ్చే పనిలో బృందం
ఇప్పటికే వాప్కోస్ తన వద్ద ఉన్న నీటి లెక్కలు, సముద్రంలో కలుస్తున్న టువంటి వరద జలాలకు సంబంధించిన గణాంకాలను ప్రాథమికంగా అధ్యయనం చేసింది. కేంద్ర జల సంఘం నీటి ప్రాజెక్టులు, వరద గణాంకాలను సంబంధించిన లెక్కలు అడిగిన నేపథ్యంలో దీనికి సంబంధించిన నివేదిక సిద్ధం చేసే పనిలో ఉంది శంభునాథ్ బృందం. మరో రెండు రోజుల్లో ఈ పనిని పూర్తి చేసి దీనిపైన సమగ్ర నివేదికను కేంద్రానికి సమర్పించనుంది.
ఏపీ నీటి ప్రాజెక్ట్ లకు తెలంగాణాతో ఇబ్బంది
ఇదిలా ఉంటే బనకచర్ల పథకానికి అభ్యంతరాలు ఉండబోవని మొదట భావించామని, కానీ కేంద్రం నుండి ప్రాథమిక దశలోనే అభ్యంతరాలు రావడంతో కొంత ఇబ్బందికరంగా పరిస్థితి మారిందని ఏపీ జలవనరుల శాఖ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నీటి ప్రాజెక్టులు కట్టాలి అన్న తెలంగాణ నుంచి అభ్యంతరాలు రావడం ఇబ్బందిగా మారుతుందని చెబుతోంది.
వాప్కోస్ సమాధానాలు సిద్ధం చేయగానే కేంద్రానికి నివేదిస్తారు
ప్రస్తుతం బనకచర్ల కు ఎదురవుతున్న అవాంతరాలను అధిగమించి త్వరలోనే వాస్తవ నివేదికలను, కేంద్ర సంస్థలు అడిగిన సమాచారాన్ని సమర్పించి ఆమోదాన్ని పొందుతామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నాటికి వాప్కోస్ సమాధానాలు సిద్ధం చేయగానే వాటిని జల సంఘానికి, ఈ ఏసి కి నివేదిస్తామని అనంతరం అధికారుల బృందం ఢిల్లీ వెళ్లి సంబంధిత అధికారులతో సమావేశమై వివరణ ఇస్తుందని ఏపీ జల వనరుల శాఖ చెబుతోంది.
ఎవరికి లాభం జరుగుతుందో?
ఏదేమైనప్పటికీ రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అధ్యయనంలో ఏమి తేల్చి నివేదిక ఇస్తుందో ఎవరికి లాభం జరుగుతుందో అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఏపీకి మాత్రం బనకచర్ల ప్రాజెక్ట్ కత్తి మీద సాములా మారింది. తెలంగాణాకు అడ్డుకోవటం అనివార్యంగా మారింది.












Click it and Unblock the Notifications