ప్యాకేజీ అడిగాం: చిరు, ఏమౌతుందో చూడండి: గంటా
రాజమండ్రి: రాష్ట్ర విభజన పైన కేంద్రం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని, విభజన అనివార్యమైతే సీమాంధ్రకు మంచి ప్యాకేజీ ఇవ్వాలని అడిగామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి బుధవారం చెప్పారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని హావ్‌లాక్ బ్రిడ్జిని సందర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. హావ్‌లాక్ బ్రిడ్జిని పర్యాటక శాఖ పరిధిలోకి తీసుకు వస్తామని చెప్పారు. గోదావరి తీర ప్రాంత పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. తమ మొదటి ప్రాధాన్యత సమైక్యాంధ్రే అన్నారు. విభజన అనివార్యమైతే మాత్రం సీమాంధ్రకు ప్యాకేజీ ఇవ్వాలన్నారు.
ఏకాభిప్రాయం లేకుండానా: మండలి
కేంద్ర ప్రభుత్వం ఒంటెత్తు పోకడల వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని అధికార భాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్ధ ప్రసాద్ కృష్ణా జిల్లాలో అన్నారు. ఏకాభిప్రాయం లేకుండా రాష్ట్రాన్ని ఎలా విడదీస్తారని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు.
సుప్రీం కోర్టుకు సిఎం రమేష్
తెలుగుదేశం పార్టీ నేత, సీనియర్ రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్ ఆర్టికల్ 371 డి పైన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఆర్టికల్ ఉండగా విభజన సాధ్యం కాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇంతకుముందు పయ్యావుల కేశవ్ విభజన తీరు పైన పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

ఏం జరుగుతుందో చూడండి: గంటా
విభజనపై కేంద్రం ఏకపక్షంగా వెళితే ఏం జరుగుతుందో వేచి చూడాలని మంత్రి గంటా శ్రీనివాస రావు విశాఖపట్నంలో అన్నారు. జివోఎం భేటీలో గురువారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బలంగా సమైక్యవాదాన్ని వినిపిస్తారన్నారు. సమాచారం ఇచ్చినంత మాత్రాన విభజన జరిగినట్టు కాదన్నారు. అసెంబ్లీకి బిల్లు వస్తే తాము వ్యతిరేకిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం అఢిగిన సమాచారం ఇవ్వడం అధికారుల బాధ్యత అన్నారు.












Click it and Unblock the Notifications