రాయలతో రణరంగమే: ఎర్రబెల్లి, తెరాసపై రేవంత్ సెటైర్
హైదరాబాద్: రాయల తెలంగాణ అంటే రంగమేనని, తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెసు పార్టీ కుట్రలు చేస్తోందని టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర రావు ధ్వజమెత్తారు. రాయల తెలంగాణ ప్రకటిస్తే ఒప్పుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
సోమవారం వరంగల్ జిల్లా పాలకుర్తిలో విలేకరులతో మాట్లాడారు. రాయల తెలంగాణ ఇస్తే ఇక్కడి ప్రజలపై రాయలసీమ నాయకులు పెత్తనం చేస్తారన్నారు. హైదరాబాద్‌లో మోత్కుపల్లి నర్సింహులు విలేకరులతో మాట్లాడుతూ రాయల తెలంగాణ దిశగా కేంద్రం అడుగులు వేస్తుంటే తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.

రాయల తెలంగాణ ఇస్తున్నట్లుగా కాంగ్రెస్ స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నా ఫాంహౌస్ నుంచి ఎందుకు బయటకు రావడం లేదని, ఢిల్లీకి వెళ్లి సోనియాను ఎందుకు నిలదీయడం లేదని, ప్రతిదీ సోనియా తన చెవిలోనే చెబుతుందని కెసిఆర్ పదేపదే చెబుతుంటారని, ఇది కూడా మీ ఇద్దరి ఒప్పందంలో భాగంగానే జరిగిందా చెప్పాలని ప్రశ్నించారు.
ఢిల్లీ వెళ్లి రాయల తెలంగాణను అడ్డుకోకపోతే కెసిఆర్‌కు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. రాయల తెలంగాణ కాంగ్రెస్ కుట్ర అని రేవంత్ రెడ్డి అన్నారు. తెరాసను టికెట్లు రాని సంఘంగా రేవంత్ అభివర్ణించారు. రాయల తెలంగాణ అంశాన్ని కేంద్రం తెరపైకి తెస్తున్నా కెసిఆర్ స్పందించకుండా ఫాంహౌజ్‌కే పరిమితం కావడమేమిటన్నారు.












Click it and Unblock the Notifications