"మేము చదవడాన్ని ఇష్టపడతాం"-వేసవి సెలవుల్లో జగన్ సర్కార్ కొత్త కార్యక్రమం
ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించే సమయం ఆసన్నమవుతోంది. ఈ నెలాఖరులో వేసవి సెలవులు ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. అదే సమయంలో ఈ సెలవుల్ని సద్వినియోగం చేసుకునేలా విద్యార్ధుల్ని ప్రోత్సహించేందుకు ఈ ఏడాది ఓ కొంగొత్త కార్యక్రమానికి రూపకల్పన చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు నిర్వహించేలా ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది.
ఏపీలో ఈ ఏడాది వేసవిలో "మేము చదవడాన్ని ఇష్టపడతాం" పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఓ కొత్త కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వేసవి సెలవులు ఇచ్చిన తర్వాత విద్యార్ధుల ఖాళీ సమయం సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తుకు పనికొచ్చేలా చేయడం దీని ఉద్దేశం. ఈ మేరకు విద్యార్ధుల్ని ఖాళీగా ఉంచకుండా వారికి కథలతో కాలక్షేపం చేయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ఈ ఏడాది మే 1 నుంచి జూన్ 10వ తేదీ వరకూ "మేము చదవడాన్ని ఇష్టపడతాం" పేరుతో కొత్త కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా టీచర్లు విద్యార్ధులను విభజించి దత్తత తీసుకుంటారు. వారి కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేస్తారు. అందులో వారికి రోజువారీ కథలు పంపిస్తారు. ఆ తర్వాత సదరు కథలపై వారి అభిప్రాయాల్ని సేకరిస్తారు. తద్వారా వారిలో చదివే నైపుణ్యాలను అభివృద్ధి చేస్తారు.
అలాగే ప్రతీ క్లాసుకూ గ్రంథాలయ పుస్తకాలను విభజించి విద్యార్ధులకు అందచేస్తారు. విద్యార్ధుల సామర్ధ్యం ఆధారంగా 5 నుంచి 10 పుస్తకాలను విద్యార్దులకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇలా 1-5 తరగతులు చదువుతున్న విద్యార్ధులు కథలు చదువుతూ వాటిని రికార్డు చేసి పంపించాలని ఆదేశించారు.
అలాగే 6-8 తరగతుల విద్యార్దులు అయితే స్వయంగా కథలు రాసి పంపించాలి. 9-12 తరగతుల విద్యార్ధులు, డైట్ విద్యార్ధులు రెండు కథలు రాసి ఈ మెయిల్ చేసేలా ప్రోత్సహిస్తారు. ఇళ్లలో సొంతంగా లైబ్రరీల నిర్వహణ, డ్రాయింగ్ పోటీలు కూడా నిర్వహించాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications