టీని వ్యతిరేకించే వ్యక్తిగా సహించం: సిఎంపై జానా
నల్లగొండ: ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ పర్యటనకు వస్తే తమకు అభ్యంతరం లేదని, అయితే రాష్ట్ర విభజనను వ్యతిరేకించే వ్యక్తిగా వస్తే మాత్రం సహించబోమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. జానా రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రెండు ప్రాంతాలకు ప్రతినిధి ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను వ్యతిరేకించడం సరి కాదని ఆయన అన్నారు.
పంచాయతీ విభజనలాంటిదే రాష్ట్ర విభజన అని ఆయన అన్నారు. పంచాయతీ తీర్మానం లేకుండా తాను మంత్రిగా పంచాయతీని విభజించవచ్చునని, అలాగే కేంద్ర రాష్ట్రాన్ని విభజిస్తుందని ఆయన చెప్పారు. చట్టాలను సవరించైనా సరే రాష్ట్ర విభజన రాజ్యాంగబద్దంగానే జరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సానుభూతి, సహాయం అవసరం లేదని ఆయన అన్నారు.

విద్యార్థుల ఆత్మహత్యల సమయంలో రానివారు తెలంగాణకు పంట నష్టం సమయంలో రావడం రాజకీయమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను హైదరాబాదు నుంచి ఎవరు వెళ్లిపొమ్మన్నారని ఆయన అడిగారు. జగన్ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. 371డి ఆర్టికల్ రాష్ట్ర విభజనకు ఆటంకం కాదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం ఒంటెత్తు పోకడతో పోతోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. రెండు ప్రాంతాలవారిని కూర్చోబెట్టి మాట్లాడాలని తాను అడిగినా స్పందన లేదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తమ పార్టీ మాత్రమే న్యాయం చేయగలదని ఆయన అన్నారు. ఆయన బుధవారం కూడా వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.












Click it and Unblock the Notifications