అల్పపీడనం ఎఫెక్ట్: ఏపీలో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణం ప్రభావం ఏపీపై విస్తృతంగా పడింది. ఒడిశా తీరం నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ఈ ద్రోణి ప్రభావం వల్ల రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో ఏపీలో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తోన్నారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతాయని చెబుతున్నారు. ఈ అల్పపీడన ద్రోణి తుఫాన్‌గా మారే అవకాశాలు లేవని స్పష్టం చేశారు.
ఈ ద్రోణి ప్రభావంతో ప్రత్యేకించి- ఉత్తరాంధ్ర, కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదవుతుందని తెలుస్తోంది. మధ్యాహ్నం తరువాత ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అభిప్రాయపడుతోంది. చిత్తూరు, అనంతపురం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.

చిత్తూరు జిల్లా కలకడ-30, నాగలాపురం-25, పుత్తూరు-12, నగరి-8, పిచ్చాటూరు-3, అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బ-19, బెళుగుప్ప-13, ధర్మవరం-9, కల్యాణదుర్గం-7, కదిరి-7, హిందూపురం-6 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పెడన-38, మచిలీపట్నం-24, కైకలూరు-19, మొవ్వ-13, నాదెండ్ల-12, ఘంటసాల-10, కొల్లూరు-10 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసింది. ఈ సాయంత్రం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.
ఇదే పరిస్థితి కొన్ని గంటల పాటు కొనసాగవచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో మరిన్ని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశాలు లేకపోలేదు. ఉరవకొండ, కల్యాణదుర్గం, ధర్మవరం, పెనుకొండ, హిందూపురం, మడకశిర, అమరాపురం, రాయదుర్గం వంటి చోట్ల ఓ మోస్తరు వర్షపాతం పడొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే కురిసిన భారీ వర్షాల వల్ల హంద్రీ-నీవా జలకళను సంతరించుకుంటోంది. పేరూరు జలాశయానికి వరదనీరు వచ్చి చేరింది.












Click it and Unblock the Notifications