మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు
రానున్న మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే, మరో మూడు రోజులపాటు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. శని, ఆదివారాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో రానున్న మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉరుములుమెరుపులతో కూడిన జల్లులు పడతాయని పేర్కొంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈదురుగాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. సోమవారం కూడా ఇదే పరిస్థితి ఉండనుందని తెలిపింది.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో రెండు రోజులపాటు వర్షాలు రెండ్రోజులపాటు కురుస్తాయని పేర్కొంది.












Click it and Unblock the Notifications