పెళ్ళిళ్ళలో బౌన్సర్లు.. ఈ కొత్త గోలేంట్రా నాయనా!!
ప్రస్తుత సమాజంలో పెళ్లిళ్ల ట్రెండు మారిపోతుంది. వివాహ వేడుకకు ఎందుకు వచ్చామా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి కలిగేలా చేస్తుంది. సహజంగా వివాహ వేడుకకు ఆహ్వానించిన వారిని, ఆహ్వానితులు పెళ్లిలో వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించాలని వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చి మరీ ఆహ్వానిస్తారు. అయితే ప్రస్తుతం వివాహాలలో జరుగుతున్న తంతు పెళ్లిళ్లకు వచ్చిన వారికి చిరాకును కలిగిస్తుంది.
పెళ్ళిళ్ళలో బౌన్సర్ల ట్రెండ్
ఫోటో షూట్ లు, వీడియో షూట్లు మాత్రమే కాదు కొత్తగా ఇంకొక ట్రెండు మరింత చిరాకు కలిగేలా చేస్తుంది. ఇటీవల కాలంలో పెళ్లిళ్లలో బౌన్సర్ లను పెట్టుకోవడం పరిపాటిగా మారింది. అయితే పెళ్లిళ్లలో భద్రత మరియు క్రమశిక్షణ కోసం బౌన్సర్ లను పెట్టుకున్నట్టు చెబుతున్నప్పటికీ, బౌన్సర్ లను పెట్టడం ప్రస్తుతం ఒక స్టేటస్ సింబల్ గా మారింది.

బౌన్సర్ ల వ్యవస్థపైన చిరాకు
పెళ్లి వేడుకకు వచ్చే అతిధులను పర్యవేక్షించడం, అనధికారిక వ్యక్తులను నియంత్రించడం, పెళ్లిళ్లలో ఏదైనా గొడవలు, ఘర్షణలు జరిగితే వాటిని నివారించడం, పెళ్లికి వచ్చిన వారికి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం వంటి కార్యకలాపాలను బౌన్సర్లు చూసుకోవాలి. కానీ అందుకు భిన్నంగా వేదికపైకి వెళ్లి వధూవరులను ఆశీర్వదించడానికి వచ్చిన వారిని అడ్డుకోవడం, ఇష్టమొచ్చినట్టు పక్కకు నెట్టడం, లాగి పడేయడం అంటే చర్యలతో ఈ బౌన్సర్ ల వ్యవస్థపైన చాలామంది చిరాకు వ్యక్తం చేస్తున్నారు.
బౌన్సర్ లతో నిర్బంధంగా పెళ్ళిళ్ళు
తమ పిల్లల పెళ్ళికి రండి అని ఆహ్వానించి, పెళ్లికి వెళ్లిన తర్వాత ఈ అమర్యాదకరమైన ఈ చర్యలు ఏమిటి అని పలువురు ప్రస్తుతం మారిన ఈ ట్రెండ్ పైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి అంటేనే పిలిచిన బంధువులందరూ వచ్చి వధూవరులను ఆశీర్వదించడం అని, అది కూడా నిర్బంధంగా సాగితే అటువంటి పెళ్లిళ్ల ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు అని ప్రశ్నిస్తున్నారు.
పెళ్ళికి ఆహ్వానం సరే మర్యాద ఎక్కడ?
సమాజంలో ఈ ధోరణి ఏమాత్రం మంచిది కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పెళ్లి అనే దానికి ఒక అర్ధం ఉందని, ప్రస్తుతం ఆ అర్ధమే మారిపోయిందని అంటున్నారు. ఫోటోలు, వీడియోలకు, బౌన్సర్ లకు ఇచ్చిన ప్రాధాన్యత అసలైన పెళ్లి తంతుకు, పెళ్ళికి ఆహ్వానించిన వారిని మర్యాదగా చూడటానికి ఇవ్వటం లేదని అంటున్నారు. ఈ ధోరణి ఇలా కొనసాగితే కష్టం అని అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications