ఏపీలో సంక్షేమ క్యాలెండర్ : నెలవారీ పథకాల అమలు , కార్యక్రమాల వివరాలతో సమగ్ర ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్లోని జగన్ సర్కార్ ప్రజలకు అందించే సంక్షేమ కార్యక్రమాల విషయంలో పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. కరోనా కష్ట కాలం లోనూ, ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నా ఎక్కడ వెనుకడుగు వేయకుండా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు వెళుతున్న ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ పథకాలను అందించే నెలలు, వాటి అమలుకు సంబంధించి క్యాలెండర్ ను రూపొందించింది .

ఈ ఏడాది ఎప్పుడు ఏ పథకాలను అమలు చేస్తున్నారో తెలిపేలా సంక్షేమ క్యాలెండర్
2021 -22 సంవత్సరానికి గాను నెలల వారీగా అమలు చేయనున్న ప్రభుత్వ పథకాలపై పక్కా క్యాలెండర్ ను రూపొందించి ప్లవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ నవరత్నాల క్యాలెండర్ లో ప్రభుత్వం ఈ ఏడాది ఎప్పుడు ఏ పథకాలను అమలు చేస్తున్నారు. ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించనున్నారు అన్న అంశాలను పొందుపరిచారు.క్యాలెండర్ తొలి పేజీలో అన్ని పథకాల వివరాలను ప్రచురించారు.

ఏయే పథకాలు, ఎంత మందికి ప్రయోజనం కలిగింది తెలిపేలా క్యాలెండర్
రెండవ పేజీలో గత ఇరవై రెండు నెలల కాలంలో 2019 జూన్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఏ ఏ పథకాలతో ఎంత మందికి ఎన్ని కోట్ల మేర ప్రయోజనం కల్పించారు అంశాలను, మూడో పేజీలో వైయస్సార్ ఆసరా పెన్షన్ పథకానికి సంబంధించిన వివరాలను ప్రచురించారు. ఏ నెలలో ఏ ఏ పథకాలు, ఏ ఏ కార్యక్రమాలు అమలు చేస్తారన్న విషయాలను వివరిస్తూ రూపొందించిన ఈ సంక్షేమ క్యాలెండర్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు .

ఏప్రిల్ , మే నెలల్లో సంక్షేమ పథకాలు , కార్యక్రమాలు ఇవే
ఇక నెలల వారీగా వివిధ కార్యక్రమాలు, పథకాల విషయానికి వస్తే ఏప్రిల్ 2021లో జగనన్న వసతి దీవెన మొదటి విడత, జగనన్న విద్యా దీవెన మొదటి విడత, రైతులకు వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం, పొదుపు సంఘాల మహిళలకు వైయస్ఆర్ సున్నా వడ్డీ చెల్లింపులు చేయనున్నట్లుగా పేర్కొన్నారు.
ఇక మే 2021లో వైయస్సార్ ఉచిత పంటల బీమా , వైయస్సార్ రైతు భరోసా మొదటి విడత, మత్స్యకార భరోసా మాత్రమే కాకుండా రెగ్యులర్ గా ఇచ్చే పథకాలను కూడా అమలు చేస్తున్నామని తెలిపారు.

జూన్ , జులై , ఆగస్ట్ నెలల పథకాల వివరాలు
జూన్ నెలలో వైయస్సార్ చేయూత ,జగనన్న విద్య కానుకతో పాటు రెగ్యులర్ పథకాలను అందిస్తామని, జులై నెలలో జగనన్న విద్యా దీవెన రెండో విడత, వైయస్సార్ కాపు నేస్తం, వైయస్సార్ వాహన మిత్ర తో పాటుగా రెగ్యులర్ పథకాలను కూడా అందిస్తామని వెల్లడించారు. ఇక ఆగస్టు నెలలో రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులు, ఎంఎస్ఎంఈ , స్పిన్నింగ్ మిల్లుల పారిశ్రామిక రాయితీలు, వైయస్సార్ నేతన్న నేస్తం, అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులతోపాటుగా రెగ్యులర్ పథకాలను అందిస్తామని క్యాలెండర్ లో వివరించారు.

సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు వివరాలివే
సెప్టెంబర్ నెలలో వైయస్సార్ ఆసరా తో పాటుగా రెగ్యులర్ పథకాలను అందించనున్నట్లు అక్టోబర్ నెలలో వైయస్సార్ రైతు భరోసా రెండో విడత, జగనన్న చేదోడు ,జగనన్న తోడుతో పాటు రెగ్యులర్ పథకాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ నెలలో వైయస్సార్ ఈబీసీ నేస్తంతో పాటు రెగ్యులర్ పథకాలను అందించనున్నట్లు, డిసెంబరు నెలలో జగనన్న వసతి దీవెన రెండో విడత, జగనన్న విద్య దీవెన మూడో విడత తో పాటుగా, వైయస్సార్ లా నేస్తం , రెగ్యులర్ పథకాలు అందించనున్నారు.

ఉగాది సందర్భంగా సంక్షేమ క్యాలెండర్ పై ఉత్తర్వులిచ్చిన అధికారులు
ఇక 2022 జనవరి నెలలో వైఎస్సార్ రైతు భరోసా మూడో విడత , జగనన్న అమ్మ ఒడి , పెన్షన్ పెంపు 2500 రూపాయలకు పెంచి రెగ్యులర్ పథకాలను అమలు చేయనున్నారు. ఫిబ్రవరి నెలలో జగనన్న విద్యా దీవెన నాలుగో విడత తో పాటుగా రెగ్యులర్ పథకాలు అందించనున్నారు.
ఇలా ఏడాది సంక్షేమ పథకాలు, వివిధ కార్యక్రమాల అమలుకు సంబంధించి అన్ని వివరాలతో క్యాలెండర్ ను ఈ రోజు ఉగాది సందర్భంగా ప్రచురించారు .












Click it and Unblock the Notifications