Visakhapatnam North: విశాఖ ఉత్తర నియోజకవర్గం చరిత్ర ఇదీ-వైసీపీ బోణీ కొట్టని సీటు..!
ఏపీలో కార్యనిర్వాహక రాజధానిగా మారబోతున్న విశాఖ నగరంలో ఉన్న అసెంబ్లీ సీట్లలో విశాఖ ఉత్తరం కూడా ఒకటి. విశాఖ లోక్ సభ సీటు పరిధిలోకి వచ్చే ఈ అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 3 లక్షల మంది ఓటర్లున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల్ని సైతం ఆదరించిన ఈ సీటులో అధికార వైసీపీ మాత్రం ఇంతవరకూ బోణీ కొట్టలేదు. దీంతో రాజధాని ప్రకటన తర్వతా మారిన పరిణామాల్లో ఈసారి గెలుపు కోసం వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
విశాఖ ఉత్తరంలో కుల సమీకరణాల్ని ఓసారి గమనిస్తే.. గవరలు , తూర్పు కాపులు , కొప్పుల వెలమలు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత మైనారిటీలు కూడా చెప్పుకోదగిన స్ధాయిలో ఉన్నారు. రాజకీయంగా చూస్తే క్షత్రియ కులస్థులు ఇక్కడ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు . విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కువగా ఉండే ఉత్తర నియోజకవర్గానికి సుదీర్ఘ చరిత్ర ఉంది.

1952 నుంచి 2006 వరకూ విశాఖపట్నం 1 నియోజకవర్గంగా ఇది ఉండేది. 2006 ఉప ఎన్నికతో సహా 13 సార్లు ఇక్కడ ఎన్నికలు జరిగాయి. 1952లో కిసాన్ మజ్దూర్ పార్టీ తరఫున, 1967 లో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా తెన్నేటి విశ్వనాథం ఈ సీటు నుంచి రెండు సార్లు గెలిచారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి ఏడుసార్లు గెలిచింది. 1955, 1962, 1972, 1978, 1989, 2004, 2006 ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ గెలిచింది. ఆ తర్వాత టీడీపీ మూడుసార్లు (1983, 1985, 1994) గెలిచింది. 1999లో బీజేపీ-టీడీపీ పొత్తులో బీజేపీ అభ్యర్ధి కంభంపాటి హరిబాబు ఇక్కడ గెలిచారు.
నియోజకవర్గాల పునర్విభజన, రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లోనూ బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్ధిగా విష్ణుకుమార్ రాజు ఇక్కడ గెలిచారు. 2019లో మాత్రం టీడీపీ ఒంటరిగా పోటీ చేయగా.. గంటా శ్రీనివాసరావు ఇక్కడి నుంచి గెలిచారు. గతంలో మూడుసార్లు (1983, 1985, 1989) ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి మహిళలే గెలిచారు. టీడీపీ నుంచి 1983లో గ్రంధి మాధవి , 1985లో అల్లు భానుమతి, 1989లో కాంగ్రెస్ నుండి ఈటి విజయలక్ష్మి ఎన్నికయ్యారు. అలాగే 2004, 2006లో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ ఇక్కడి నుంచి గెలుపొందారు. కానీ వైసీపీ మాత్రం ఇక్కడ పోటీ చేసిన రెండుసార్లు 2014, 2019లో ఓడిపోయింది. దీంతో 2024లో అయినా బోణీ కోసం ఎదురుచూస్తోంది.
2019 ఎన్నికల్ని గమనిస్తే టీడీపీ అభ్యర్ధి గంటా శ్రీనివాస్ 67352 ఓట్లు సాధించి 65408 ఓట్లు సాధించిన వైసీపీ అభ్యర్ధి కేకే రాజుపై కేవలం రెండు వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. అదే సమయంలో జనసేన అభ్యర్ధికి 19,139 ఓట్లు , బీజేపీ అభ్యర్ధి, సిట్టింగ్ ఎమ్మెల్యే విఘ్ణకుమార్ రాజుకు 18,790 ఓట్లు, కాంగ్రెస్ కు 2,054 ఓట్లు వచ్చాయి. ఈసారి టీడీపీ-జనసేన పొత్తు ఉండటం, బీజేపీ కూడా కలిసి వస్తే వైసీపీ ఈసారి కూడా బోణీ కొట్టడం కష్టమనే అంచనాలున్నాయి.












Click it and Unblock the Notifications