Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా పవన్ పనితీరు ఎలా ఉంది ? ఫీడ్ బ్యాక్ ఇదే..
ఏపీలో తొలిసారి వంద శాతం స్ట్రైక్ రేట్ తో జనసేన పార్టీని గెలిపించడంతో పాటు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్ పనితీరు ఎలాఉంది ?, తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ అధికారులతో ఎలా వ్యవహరిస్తున్నారు ?, ప్రజా సమస్యల పరిష్కారంపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారా ? మీడియాకు ఎందుకు దూరంగా ఉండిపోతున్నారు ? ఇలా పలు అంశాలు చర్చకు వస్తున్నాయి. మంత్రిగా తొలి నెలలో పవన్ పనితీరుపై ఓ ఫీడ్ బ్యాక్..
రాష్ట్రంలో తొలిసారి ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్.. తొలి విడతలోనే మంత్రిగా, డిప్యూటీ సీఎంగా, గ్రామీణాభివృద్ధి వంటి పలు కీలక శాఖలను నడిపిస్తున్నారు. రాజకీయాల్లో వ్యవహారశైలికీ, మంత్రిగా పనితీరుకు మధ్య చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా మంత్రులకు తమ శాఖలపై పట్టు పెంచుకోవాలని సీఎం చంద్రబాబు పదే పదే సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ నెల రోజుల్లో ఏ చేశారో ఓ సారి గమనిస్తే.. మంత్రిగా ఆయన పనితీరుపై ఓ అంచనాకు రావొచ్చు.

మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే పవన్ కళ్యాణ్ నిరంతరం శాఖాపరమైన సమీక్షలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ముఖ్యంగా ఆయా శాఖల్లో అంశాలపై పట్టు పెంచుకునేందుకు వీలుగా పూర్తి స్ధాయిలో సుదీర్ఘ సమయం ఇందుకు వెచ్చిస్తున్నారు. తొలి రెండు, మూడు రోజుల్లో రోజుకు కనీసం 10 గంటల చొప్పున అధికారులతో పవన్ సమీక్షలు చేశారు. అనంతరం ఈ సమయాన్ని కాస్త కుదించారు.

మరోవైపు మొదట్లో శాఖాపరమైన సమీక్షలను సచివాలయంలోని తన ఛాంబర్ లోనే చేసిన పవన్ కళ్యాణ్.. ఈ మధ్య మాత్రం మంగళగిరిలోని తన ఇంట్లోనే నిర్వహిస్తున్నారు. అక్కడికే అధికారులను రప్పించుకుని సమీక్షలు చేస్తున్నారు. సచివాలయంలో పూర్తిస్ధాయి ఫర్నిచర్, ఏర్పాట్లు ఉండటంతో అక్కడ సమీక్షలు చేయడం సులువు. కానీ పవన్ ఇంట్లో ఆ మేరకు సమీక్షలకు కావాల్సిన టేబుళ్లు, కుర్చీలు లేకపోవడంతో తన చుట్టూ కుర్చీలు వేయించుకుని అధికారులతో చర్చిస్తున్నారు.

అటు మీడియాతో సంభాషణలు, ప్రెస్ మీట్ల విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ ఒక్క మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. అలాగని మీడియాకు చెప్పాల్సిన విషయాలు లేవా అంటే అదీ కాదు. శాఖలపై పట్టు పెంచుకోకుండా మీడియా ముందుకు వస్తే ఇబ్బందులు ఎదురవుతాయని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే మీడియాకు తాత్కాలికంగా దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, వాటికి వెంటనే పరిష్కారాలు చూపేందుకు పవన్ ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications