విజయసాయిరెడ్డి -షర్మిల భేటీ వెనుక సీక్రెట్ ఏంటి.. ఓపెన్ అయిన షర్మిల
ఏపీలో మాజీ వైసీపీ నేత విజయసాయి రెడ్డి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన సాయిరెడ్డి.. పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే ఆయన జగన్ సోదరి, కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో భేటీ కావడం సంచలనంగా మారింది. హైదరాబాద్‌లో షర్మిల ఇంటికి వెళ్లి.. దాదాపు 3 గంటలపాటు సమావేశం అయ్యారు. తాజాగా విజయసాయిరెడ్డితో భేటీ గురించి షర్మిల స్పందించారు.
విజయసాయిరెడ్డితో చాలా విషయాలు మాట్లాడానని.. ఆయన జగన్ వల్ల పడిన ఇబ్బందుల్ని చెప్పారని షర్మిల వ్యాఖ్యానించారు. షేర్లు తనకే చెందాలని, తనపై, తన తల్లిపై జగన్ కేసు పెట్టారని గుర్తు చేశారు. అప్పట్లో తాను చెప్పిన మాటలు అబద్ధాలు అని జగన్.. విజయసాయిరెడ్డితో చెప్పించారన్నారు. సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి మాటలు అసత్యం అని చెప్పారు.

విజయసాయిరెడ్డిని పిలిపించి 40 నిమిషాల పాటు.. ఎలా చెప్పాలి, నాకు వ్యతిరేకంగా ఏం మాట్లాడాలో జగనే చెప్పారు. అంత చెప్పినా విజయసాయి రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టకపోవడంతో జగన్ ఆయనపై సీరియస్ అయ్యారట. ఆ విషయాలన్నీ విజయసాయిరెడ్డి నాకు చెప్పారు. అవి విన్నాక నాకు ఏడుపొచ్చేసిందని వైఎస్ షర్మిల వివరించారు.
మరోవైపు జగన్ ఇటీవల క్యారెక్టర్ గురించి పెద్ద పెద్ద డైలాగులు చెబుతున్నారు. అసలు క్యారెక్టర్ అంటే ఏమిటో జగన్ మరిచిపోయారు. వైఎస్ కోరికకు భిన్నంగా అబద్ధం చెప్పాలని విజయసాయిపై ఒత్తిడి చేశారు. నా పరువు పోతుంది.. వదిలేయండి అన్నా.. అని చెప్పినా జగన్ ఊరుకోలేదు. ఏ అబద్ధం ఎలా చెప్పాలో జగన్ చెబితే.. విజయసాయిరెడ్డి రాసుకున్నారట.
జగన్, అతని భార్య ఎంత దిగజారిపోయారో బైబిల్ ముందు కూర్చుని ఆలోచన చేయాలన్నారు. దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో.. జగన్ చెబితే అలా ఉంది. జగన్‌కు విశ్వసనీయత, విలువలు ఏ మాత్రం లేవని ఫైర్ అయ్యారు. విజయసాయి రెడ్డి ప్రయాణం ఏమిటో తనకు తెలియదని షర్మిల స్పష్టం చేశారు. దీంతో ఓ వైపు అధికారంలో ఉన్న కూటమి.. మరోవైపు సొంత చెల్లితో వైరంతో నలిగిపోతున్న జగన్ కి.. అత్యంత ఆప్తులు కూడా దూరం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications