చంద్రబాబు వ్యూహం ఏమిటి?: దిష్టి తీయించుకున్న ఎంపీ
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు విషయంలో చోటు చేసుకున్న తాజా పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వ్యూహం ఏమిటనేది ఉత్కంఠగా మారింది. అప్పుడే ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి ఎవరనే ఊహాగానాలు కూడా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం డిజిపి జెవి రాముడు, నిఘా విభాగం చీఫ్ అనురాధలతోనూ మంత్రులతోనూ సుదీర్ఘంగా సమావేశమయ్యారు.
విడతలు విడతలుగా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఒక్కరొక్కరే తెలంగాణ ప్రభుత్వంపై, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై, హైదరాబాదుపై తమకు ఉన్న హక్కులపై తీవ్ర స్వరాలతో మాట్లాడారు. హెచ్చరికలలాంటివి కూడా చేశారు. ఎసిబి నోటీసు ఇచ్చినా తీసుకోవాల్సిన అవసరం లేదని, తెగే దాకా లాగుదామని చంద్రబాబు సమావేశంలో అన్నట్లు చెబుతున్నారు.
చంద్రబాబుపై చర్యలు తీసుకుంటే కెసిఆర్ రాజీనామా చేసే పరిస్థితి వస్తుందని మంత్రి పత్రిపాటి పుల్లారావు హెచ్చరించారు. చంద్రబాబుకు నోటీసులు ఇచ్చే అధికారం ఎసిబికి లేదని పత్తిపాటి పుల్లారావుతో సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై తమ వద్ద ఆధారాలున్నాయని, వాటిని బయటపెడితే కెసిఆర్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుందని పత్తిపాటి పుల్లారావు హెచ్చరికలాంటి ప్రకటన చేశారు.

అవసరమైతే తాము హైదరాబాదులో పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసుకుంటామని మరో మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నుంచి తెలంగాణ ప్రభుత్వం తప్పించుకోలేదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కక్షతో ఏమైనా చేయదలుచుకున్నా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. తెలంగాణ పోలీసుల భద్రతను తాము తీసుకోబోమని, ఏపి పోలీసులే తమకు భద్రత కల్పిస్తారని ఆయన చెప్పారు.
తాజా పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మంగళవారంనాడు ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఓటుకు నోటు రేవంత్ రెడ్డి కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి వస్తున్నలీకులతో పార్టీ శ్రేణులు అప్రమత్తమయ్యాయి. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏ క్షణమైన తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేయవచ్చునన్న ప్రచారం మంగళవారం ఉదయం నుంచి జరుగుతోంది. అయితే ఏసీబీని ఇంతవరకు ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక అందలేదని, అది లేకుండా చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడం సాధ్యం కాదని అంటున్నారు.
తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు సిఎం రమేష్ తన ఇంటి వద్ద దిష్టి తీయించాకున్నారు. ఆయన రాక సందర్భంగా ఇంటి పనివారు గుమ్మడి కాయ కొట్టి దిష్టి తీశారు. కొబ్బరి కాయ కొట్టారు. ఇంటి బయట అటు ఇటు దీపాలను వెలిగించారు. సీఎం రమేష్‌కు ఏం కాకూడదని కోరుకుంటూ వారు ఈ పనిచేశారని అంటున్నారు.
సీఎం రమేష్ తన రావడానికి ముందు సీఎం చంద్రబాబుతో సచివాలయంలో కలిసి పలు అంశాలపై చర్చించారు. అయితే ఓటుకు నోటు కేసులో టీడీపీకి చెందిన ఇద్దరు ఎంపీలను ఏసీబీ ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications