Exit Polls: గతంలో నిజమైన ఎగ్జిట్ పోల్స్ ఇవే..!
మన దేశంలో ప్రతీ ఎన్నికల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించే లోపు ఎగ్జిట్ పోల్స్ వెలువడుతుంటాయి. ఎన్నికల్లో ఓటింగ్ సరళి ఎలా ఉందనే అంశాన్ని విశ్లేషించి వాటిని ఫలితాల రూపంలోకి మార్చి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తుంటారు. అయితే పేరుకు చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేస్తున్నా వాటిలో కొన్ని మాత్రమే వాస్తవం అవుతున్న పరిస్ధితి. అయినా ప్రతిసారీ ప్రతీ ఎగ్జిట్ పోల్ పైనా ఓటర్లలో, రాజకీయ పార్టీలు, నేతల్లో ఆసక్తి మాత్రం తగ్గడం లేదు.
ఈసారి సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ఇవాళ్టితో ముగియనున్న నేపథ్యంలో సాయంత్రం ఆరున్నర గంటల తర్వాత ఎగ్డిట్ పోల్స్ విడుదలకు మరోసారి పలు జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు సిద్ధమయ్యాయి. అయితే వీటిలో గతంలో జరిగిన ఎన్నికల్లో ఏయే సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉన్నాయనే అంశాన్ని ఓసారి పరిశీలిస్తే అతి కొద్ది సంస్థలు మాత్రం ఫలితాలను వాస్తవంగా అంచనా వేసినట్లు తెలుస్తుంది. మిగతావన్నీ అవగాహనారాహిత్యంతోనో లేక కొందరి ప్రయోజనాల కోసం, బెట్టింగ్ లకు ఉపయోగపడేందుకు మాత్రమే విడుదలవుతుంటాయి.

గతంలో కచ్చితంగా సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన జాతీయ మీడియా సంస్థల్లో ఇండియా టుడే సంస్థకు మంచి పేరుంది. కేంద్రంలో అధికార పార్టీలకు అండగా నిలిచే మిగతా సర్వే సంస్థలతో పోలిస్తే ఇండియా టుడేకు కాస్త నిక్కచ్చిగా సర్వేలు చేసి ఫలితాలు ప్రకటిస్తుందనే పేరుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో చూస్తే సీపీఎస్ సర్వే కచ్చితత్వానికి మారుపేరుగా ఉంది.
2019 ఎన్నికల్లో వైసీపీకి అంత భారీ మెజార్టీ వస్తుందని సీపీఎస్ మాత్రమే అంచనా వేసింది. అలాగే ఆరా మస్తాన్ సర్వే, కేకే సర్వే, రైజ్ వంటి సంస్థలు కూడా ఫలితాలను వాస్తవానికి దగ్గరగా అంచనా వేయడంలో సక్సెస్ అయినట్లు తేలింది. కాబట్టి మరోసారి ఆయా సంస్థలు ఇచ్చే ఎగ్జిట్ పోల్స్ పై అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications