పవన్ కు హరిరామజోగయ్య డిమాండ్ల వెనుక ఉన్నదెవరు ?
ఏపీలో ఎన్నికల వేళ వైసీపీకి వ్యతిరేకంగా ఉమ్మడి పోటీకి సిద్ధమవుతున్న విపక్ష పార్టీలు టీడీపీ, జనసేనకు ఇప్పుడు పెద్ద తలనొప్పి వచ్చి పడింది. ముఖ్యంగా ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాలు, ఉమ్మడి మ్యానిఫెస్టో, క్షేత్రస్దాయిలో సమన్వయంపై కీలక చర్చలు జరుగుతున్న వేళ పవన్ కళ్యాణ్ కు గట్టి మద్దతుదారుగా ఉన్న కాపు నేత హరిరామజోగయ్య సంధిస్తున్న లేఖలు కలకలం రేపుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇరు పార్టీల మధ్య పొత్తు చర్చలకు ఈ లేఖలు ఎక్కడ ఆటంకంగా మారుతాయన్న ఆందోళన ఇరు పార్టీల క్యాడర్ లో కనిపిస్తోంది.
టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్న జనసేన పార్టీ.. ఇది విజయవంతం కావాలంటే ఏం చేయాలో హరిరామజోగయ్య పదే పదే లేఖల ద్వారా గుర్తుచేస్తున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీకి గౌరవ ప్రదమైన సీట్లు కేటాయించకపోతే ఇరు పార్టీల మధ్య పొత్తు ఫలితాన్ని ఇవ్వదని జోగయ్య తేల్చిచెప్పేస్తున్నారు. అలాగే జనసేనకు రాజ్యాధికారం ఇవ్వకపోతే పొత్తు పెట్టుకున్నా ప్రయోజనం ఉండబోదని జోగయ్య చేస్తున్న కామెంట్లు టీడీపీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి.

ఈ తరుణంలో అసలు హరిరామజోగయ్య గతంలో ఎన్నడూ లేని విధంగా జనసేనను, పవన్ కళ్యాణ్ ను ఎందుకంత ఇరుకునపెడుతున్నారు ?, అసలు ఈ లేఖల వెనుక ఉన్న లక్ష్యమేంటి ?, నిజంగా జనసేనపై ఒత్తిడి పెంచడం ద్వారా పవన్ కళ్యాణ్ కు ఆయన మేలు చేస్తున్నారా లేక ఇంకేదైనా వ్యూహం ఉందా అన్న చర్చ జరుగుతోంది. అలాగే హరిరామజోగయ్య వెనుక ఎవరున్నారనే చర్చ కూడా సాగుతోంది. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
హరిరామజోగయ్య గతంలో టీడీపీతో జనసేన పొత్తు పొడిచి, సీట్ల చర్చలు ప్రారంభించిన సమయంలో 60-70 అసెంబ్లీ సీట్ల వరకూ డిమాండ్ చేసేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 41కి చేరింది. దీని వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారనే ఓ చర్చ జరుగుతోంది. చంద్రబాబుతో సీట్ల చర్చలు జరుపుతున్న పవన్ కళ్యాణ్.. జోగయ్య ద్వారా డిమాండ్లు చేయిస్తూ సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు పొత్తులో భాగంగా కేటాయించేలా చర్చిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్వతహాగా రాజకీయాల్లో, ముఖ్యంగా సీట్లచర్చలు చేసిన అనుభవం లేని పవన్ .. ఇలా జోగయ్య ద్వారా చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నారా అన్న చర్చ నెలకొంది.












Click it and Unblock the Notifications