ఉపఎన్నికలు, బంద్ ఎఫెక్ట్: కేసీఆర్ స్పందన వెనుక..?
హైదరాబాద్: మెదక్ మండల కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా మార్చాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలో శుక్రవారం బంద్ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో తొలుత ఏడు జిల్లాలను ఏర్పాటు చేయనున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ తొలి విడత జాబితాలో మెదక్ లేదు.
దీంతో మెదక్‌ను జిల్లా కేంద్రంగా మార్చాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న వారు ఈ రోజు బందుకు పిలుపునిచ్చారు. బందు ప్రశాంతంగా సాగింది. బంద్ కారణంగా వ్యాపార, విద్యా సముదాయాలు మూతపడ్డాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఒకరు మాట్లాడుతూ.. ఈ నెల 14వ తేదీ నుండి ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

కేసీఆర్ ప్రకటన అందుకేనా?
తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. మొదటి దశలో ఏడు జిల్లాల ఏర్పాటుకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందని, పరిపాలనా వికేంద్రీకరణతోనే సత్వర అభివృద్ధి సాధ్యమన్న సంకల్పంతో మరో ఏడు జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసిందని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రెవిన్యూశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసిందని వార్తలు వచ్చాయి.
అయితే, ఈ వార్తల నేపథ్యంలో మెదక్ జిల్లాలో బందుకు పిలుపునిచ్చారు. రేపు (శనివారం) మెదక్ లోకసభకు ఉప ఎన్నికలు ఉన్నాయి. ఉప ఎన్నికకు ముందు బంద్, నిరసనలు వ్యక్తం కావడంతో.. కేసీఆర్ జిల్లాల ఏర్పాటు వార్తలు వదంతులేనని కొట్టి పారేసి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల ఏర్పాటుపై కేసీఆర్ శుక్రవారం మాట్లాడుతూ.. అవి వదంతులేనని, ఎవరు నమ్మవద్దన్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతనే జిల్లాల ఏర్పాటు ఉంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications