చంద్రబాబు, లోకేష్ కన్నా పవనే బెటరా ? సాయిరెడ్డి లెక్కేంటి ?
ఏపీలో రాజకీయాల్లో మరో సరికొత్త చర్చకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెరలేపారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పై కొన్నేళ్లుగా నిత్యం విమర్శలు చేస్తూ ట్వీట్లు పెట్టిన సాయిరెడ్డి.. పవన్ కళ్యాణ్ ను మాత్రం పల్లెత్తు మాట అనే వారు కాదు. ఇదే విషయాన్ని ఆయన్ను పలు ఇంటర్వ్యూల్లో కూడా ప్రశ్నిస్తే తెలివిగా సమాధానాలు ఇచ్చేవారు. అయితే మరోసారి ఆయన పవన్ కళ్యాణ్ పై తన భక్తి చాటుకున్నారు. చంద్రబాబు, లోకేష్ కంటే పవన్ బెటర్ లీడర్ అని సాయిరెడ్డి తేల్చిచెప్పేశారు.
కాకినాడ పోర్టు యాజమాన్య హక్కుల బదిలీ కోసం గతంలో సీఎండీగా ఉన్న కేవీరావును బెదిరించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డి నిన్న సీఐడీ దర్యాప్తుపై నోరు విప్పారు. పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు పర్యటన తర్వాత కేవీ రావు ఫిర్యాదు మేరకు సాయిరెడ్డితో పాటు మరికొందరు వైసీపీ నేతలపై సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో తన పాత్రపై వైసీపీ ఎంపీ స్పందించారు. కేవీ రావు బ్రోకర్ అని, చంద్రబాబు మనిషని తేల్చిచెప్పేశారు. అయితే చివర్లో పవన్ ను వారితో పోలిస్తే బెటర్ లీడర్ అన్నారు.

పవన్ కళ్యాణ్ విజయసాయిరెడ్డికి బెటర్ లీడర్ గా కనిపించడానికి వెనుక ఉన్న కారణాలను ఓసారి పరిశీలిస్తే.. గతంలో ఎప్పుడూ సాయిరెడ్డి పేరుతో పవన్ వ్యక్తిగత విమర్శలు చేయలేదు. కానీ చంద్రబాబు, లోకేష్ మాత్రం వైఎస్ కుటుంబంపై ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో వారి ఆడిటర్ అయిన సాయిరెడ్డిని ముందు నుంచీ టార్గెట్ చేస్తూనే ఉన్నారు. అలాగే ప్రస్తుతం కాకినాడ పోర్టు వ్యవహారంలోనూ పవన్ భద్రతా కారణాలు, రేషన్ బియ్యం అక్రమ రవాణా గురించి ప్రశ్నించి వదిలేశారు. కానీ చంద్రబాబు మాత్రం కేవీరావుతో సీఐడీకి ఫిర్యాదు చేయించి తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారనేది సాయిరెడ్డి భావనగా కనిపిస్తోంది. అలా పవన్ పరిణతితో వ్యవహరిస్తుంటే చంద్రబాబు రాజకీయానికి పరిమితం అవుతున్నట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications