రీఎంట్రీ కోసం జగన్ సన్నిహిత ఐఏఎస్ ప్రయత్నాలు! చంద్రబాబు తీసుకుంటారా?
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఓ ఐఏఎస్ అధికారి తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విధులకు దూరంగా ఉండిపోయారు. ఆ తర్వాత ఏకంగా వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపోయారు. కూటమి సర్కార్ కూడా ఆయన వీఆర్ఎస్ ను ఆమోదించి సాగనంపేసింది. అయితే తిరిగి ఆయన రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి సదరు ఐఏఎస్ అధికారి చేసుకున్న విజ్ఞప్తిని సీఎం చంద్రబాబు ఆమోదిస్తే తప్ప ఆయన రీఎంట్రీ సాధ్యం కాని పరిస్ధితి నెలకొంది.
వైఎస్ జగన్ హయాంలో ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రి కార్యాలయంలో అత్యంత కీలకంగా, ఇంకా చెప్పాలంటే ,సూపర్ సీఎస్ లా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్. సీఎంవోలో అందరిపైనా తానే బాస్ అన్నట్లుగా వ్యవహరించిన ప్రవీణ్ ప్రకాష్ విశాఖను రాజధానిగా ఎంపిక చేశాక అక్కడికి వెళ్లి ప్రభుత్వ పెద్దల కోసం భవనాలు సైతం ఖరారు చేశారు. అంతే కాదు విద్యాశాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉంటూ టీచర్లకు చుక్కలు చూపించారు. విద్యాశాఖలో అన్ని పథకాల అమలుతో పాటు విమర్శలకు దారి తీసిన పలు సంస్కరణలకూ ఆయనే ఆద్యుడు. వైఎస్ జగన్ ఆయనకు ఇచ్చిన స్వేచ్ఛ అలాంటిది.

అయితే తాజాగా రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో ప్రవీణ్ ప్రకాష్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అంతే కాదు గతంలో తాను తప్పుచేసి ఉంటే క్షమించాలని టీచర్లను సైతం వేడుకున్నారు. చివరికి వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోవడం, దాన్ని ప్రభుత్వం ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. దీంతో ప్రవీణ్ ప్రకాష్ శకం ముగిసినట్లే అంతా భావించారు. కానీ అక్కడే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.
అప్పట్లో మానసిక ఒత్తిడిలో ఉండి వీఆర్ఎస్ తీసుకున్నానని, అవకాశమిస్తే వీఆర్ఎస్ వెనక్కి తీసుకుని తిరిగి విధుల్లో చేరతానంటూ ప్రభుత్వానికి ఆయన విన్నవించుకున్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు అవకాశం ఇస్తే ఆయన్ను కలిసి అన్ని విషయాలు వివరించేందుకు సిద్ధమని చెబుతున్నట్లు సమాచారం. అయితే నిబంధనల ప్రకారం వీఆర్ఎస్ తీసుకున్న మూడు నెలల వరకూ దాన్ని వెనక్కి తీసుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ పూర్తిగా సీఎం విచక్షణ మేరకే అది జరుగుతుంది. దీంతో ఇప్పుడు చంద్రబాబు నిర్ణయం కీలకంగా మారింది.












Click it and Unblock the Notifications