చంద్రబాబు సత్తాకు మరో సవాల్ ! అదానీ స్మార్ట్ మీటర్లను అడ్డుకోగలరా ?
ఏపీలో కూటమి సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబుకు వరుస సవాళ్లు తప్పడం లేదు. ఇప్పటికే సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నారని భావిస్తున్న తరుణంలో కొత్త సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో గత వైసీపీ సర్కార్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు చంద్రబాబు సర్కార్ మెడకు చుట్టుకోబోతోంది. అదే విద్యుత్ స్మార్ట్ మీటర్లు. రాష్ట్రంలో ఏకంగా 27.68 లక్షల విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల బిగింపుకు అదానీ సంస్ధ సిద్దమవుతోంది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రంలో 27.68 లక్షల విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించేందుకు అదానీ ఎలక్ట్రిసీటీ సొల్యూషన్స్ సంస్ధ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో ఇళ్లతో పాటు పరిశ్రమలు, ఇతర కమర్షియల్ కనెక్షన్లు కూడా ఉన్నాయి. ఈ మేరకు ఆయా చోట్ల స్మార్ట్ మీటర్ల బిగింపుకు అదానీ సంస్ధ సిద్దమైంది. తాజాగా స్మార్ట్ మీటర్లను గుజరాత్ నుంచి విజయవాడకు దిగుమతి చేసుకున్న అదానీ సంస్ధ.. త్వరలో వీటి ఏర్పాటుకు సిద్దమవుతోంది.

అదానీ సంస్ధ ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యుత్ సబ్ స్టేషన్లలో ఈ స్మార్ట్ మీటర్లు బిగించనుంది. ఆ తర్వాత గృహాలకు కూడా బిగించబోతోంది. ఆ మేరకు సిబ్బందిని కూడా రంగంలోకి దింపుతోంది. అయితే గతంలో జగన్ సర్కార్ స్మార్ట్ మీటర్ల ఒప్పందం చేసుకున్నప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన కూటమి పార్టీలు ఇప్పుడు అధికారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అదానీ సంస్ధ స్మార్ట్ మీటర్లు బిగించకుండా చంద్రబాబు ఎలా అడ్డుకుంటారన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే టీడీపీతో అంటగాకే సీపీఐ సైతం స్మార్ట్ మీటర్లను ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్ చేసింది. ఓసారి మీటర్ల బిగింపు ప్రారంభమైతే రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications