బద్ధశత్రువుతో వైఎస్ ఆత్మ కేవీపీ మైండ్ గేమ్ ! చంద్రబాబు పడతారా ? జగన్ పై మాత్రం మౌనం !
ఏపీ రాజకీయాల్లో ఎన్నికలకు ముందు రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా నాలుగేళ్లుగా బీజేపీతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సావాసం చేస్తున్న ఇక్కడి రాజకీయ పార్టీల్ని తిరిగి తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తోంది. ఇందులో భాగంగా రాజకీయ దిగ్గజం కేవీపీ రామచంద్రరావును రంగంలోకి దింపింది. దీంతో ఆయన ముందుగా టీడీపీ అధినేత చంద్రబాబుతో మైండ్ గేమ్ మొదలుపెట్టేశారు.
వైఎస్ కు ఒకప్పటి మిత్రుడు, ఆ తర్వాత బద్ధశత్రువు అయిన చంద్రబాబుతో ఆయన ఆత్మగా భావించే కేవీపీ రామచంద్రరావు తాజాగా మైండ్ గేమ్ మొదలుపెట్టారు. రాజకీయ విభేధాల్ని సైతం పక్కనబెట్టి చంద్రబాబు మోడీపై పోరాడాలని, తమను ముందుండి నడిపించాలని కోరుతున్నారు. గతంలో 2019 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్-టీడీపీ పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఆ దరిదాపులకు రాని కేవీపీ..ఇప్పుడు చంద్రబాబుకు దగ్గరయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఓవైపు చంద్రబాబును జిత్తుల మారి అంటూనే మరోవైపు ఆయన తమను ముందుండి నడిపించాలంటున్నారు. ముఖ్యంగా రాహుల్ కు ఇలాంటి కీలక సమయంలో మద్దతివ్వాలని కోరుతున్నారు.

వాస్తవానికి ఇప్పుడు రాహుల్ గాంధీకి చంద్రబాబు మద్దతివ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఒరిగిందేమీ లేదు. కానీ చంద్రబాబు మాత్రం మోడీ, బీజేపీ ఆగ్రహానికి గురికావడం ఖాయం. కీలకమైన ఎన్నికలకు ముందు అది చంద్రబాబుకు తీవ్ర నష్టం కలిగించడం ఖాయం. కొంతకాలంగా వైసీపీకి దూరమవుతూ టీడీపీని మళ్లీ కాస్త ఆదరిస్తున్న బీజేపీని ఈ పరిస్ధితుల్లో టీజ్ చేయడం చంద్రబాబుకు అస్సలు ఇష్టం లేదు. దీంతో కేవీపీ ఆఫర్లను చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నారు.
మరోవైపు చంద్రబాబును రాహుల్ కు మద్దతివ్వాలని కోరుతున్న కేవీపీ.. తన ఆత్మీయుడు వైఎస్సార్ బిడ్డ, ఏపీ సీఎం, వైసీపీ అధినేత అయిన వైఎస్ జగన్ ను మాత్రం టచ్ చేయడం లేదు. అదేమని అడిగితే జగన్ గురించి మరోసారి మాట్లాడతా అంటూ తప్పించుకుంటున్నారు. దీంతో ఇప్పుడు జగన్ ను అడగకుండా చంద్రబాబును మాత్రమే రాహుల్ కు మద్దతివ్వాలని కోరడం ద్వారా కేవీపీ కోరుకుంటున్నది ఏంటనే చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందు గతంలోలా కాంగ్రెస్-టీడీపీ జట్టు కట్టి పోటీ చేయాలని కేవీపీ కోరుకుంటున్నారా అన్న చర్చ తెరపైకి వస్తోంది.












Click it and Unblock the Notifications