ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ! ఎన్నికల వేళ నష్టమేనా ?
కర్నాటక, తెలంగాణలో మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీ భారీగా సక్సెస్ అయింది. దీని స్ఫూర్తితో ఏపీలో తాము అధికారంలోకి వస్తే మహాలక్ష్మి పథకంలో భాగంగా దీన్ని అమలు చేస్తామని తాజాగా టీడీపీ ఆరు గ్యారంటీల్లో ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన అధికార వైసీపీ ఇప్పుడే తాము అమలు చేస్తే ఎలా ఉంటుందని భావించింది. దీనిపై అధ్యయనం చేయాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఫలితాలు ప్రభుత్వానికి షాకిచ్చేలా ఉన్నాయి.
Recommended Video

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే వైసీపీకి ఎన్నికల్లో కచ్చితంగా ప్లస్ అవుతుందన్న అంచనాలు తొలుత వినిపించాయి. కానీ అక్కడే ఓ లొసుగు ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఆర్టీసీ బస్సుల కండిషన్ పై కానీ, ఇతరత్రా అంశాలపై కానీ ఎక్కడా చర్చ లేదు. కానీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెడితే అప్పుడు వాటిలో లోపాలు ఒక్కొక్కటిగా బయటపడతాయనే అంచనాలున్నాయి.

అసలే సోషల్ మీడియా కాలం. ఆర్టీసీ డొక్కు బస్సుల్లో మహిళల రద్దీ పెరిగితే ప్రమాదాలు కూడా తప్పవు. వీటిని విపక్షాలు హైలెట్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాయి. వీటిపై జనంలో చర్చ పెడతాయి. ఎన్నికల వేళ అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సొమ్ము చేసుకుని ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ప్రయత్నిస్తాయి. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆశిస్తున్న ప్రయోజనం కంటే నష్టం ఎక్కువగా ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. అందుకే దీనిపై దూకుడుగా ముందుకెళ్లేందుకు ప్రభుత్వం ఇష్టపడటం లేదని తెలుస్తోంది.
అయితే కర్నాటక, తెలంగాణలో ఇదే హామీ ఇచ్చి అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా అనుకోవచ్చు. కానీ అక్కడ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ఆ తర్వాత అమలు చేస్తున్నారు. అప్పుడు ఎన్నికల్లో గెలుపుకు వచ్చిన ఇబ్బందేమీ ఉండదు. గెలిచాక ఐదేళ్ల పాటు దీనిపై ఎలాంటి చర్చలున్నా రాజకీయంగా వచ్చే నష్టమేమీ లేదు. అందుకే చంద్రబాబు తెలివిగా వచ్చే ఎన్నికల్లో తాను గెలిస్తే ఈ హామీ అమలు చేస్తానని ప్రకటించారు. కానీ దీన్ని ముందుగా అమలు చేస్తే ఎన్నికల వేళ సమస్యలు వస్తే అసలుకే మోసం వస్తుందన్న భావన సర్వత్రా వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications