ఐప్యాక్ సర్వేతో రఘురామ రిజల్ట్స్ మ్యాచ్ ? పవన్-లోకేష్ ఎఫెక్ట్ కీలకం ! ముందస్తు ముహుర్తమిదే !
ఏపీలో వైసీపీ విజయావకాశాలపై గతంలో తాను నిర్వహించిన సర్వే ఫలితాలతో తాజాగా ఐప్యాక్ పేరుతో వైరల్ అవుతున్న సర్వే ఫలితాలు సరిగ్గా మ్యాచ్ అవుతున్నట్లు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు వెల్లడించారు.
ఏపీలో వివిధ రాజకీయ పార్టీల తాజా పరిస్దితిపై ఐప్యాక్ పేరుతో ఓ సర్వే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పేర్కొన్న ఫలితాలు తాను గతంలో చేసిన సర్వే ఫలితాలతో మ్యాచ్ అవుతున్నట్లు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ వెల్లడించారు. దీనికి గల కారణాలను సైతం ఆయన బయటపెట్టారు. రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాదే ముందస్తు ఎన్నికలకు ముహుర్తం కుదిరినట్లు వైసీపీ రెబెల్ ఎంపీ చెప్తున్నారు.

రఘురామ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్దితులపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను ఇదే అంశంపై నిర్వహించిన సర్వే ఫలితాలు తాజాగా ఐప్యాక్ పేరుతో వైరల్ అవుతున్న సర్వేకు చాలా దగ్గరగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి రోజుకింత దిగజారే ప్రమాదం ఉందన్నారు.
లోకేష్ యువగళం, పవన్ వారాహి యాత్ర, చంద్రబాబు పర్యటనల ప్రభావం ప్రజలపై తీవ్రంగా ఉండే ఛాన్స్ ఉందని రఘురామ చెప్తున్నారు. ఇవాళ రచ్చబండలో ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

తన సర్వేతో ఐప్యాక్ సర్వే మ్యాచ్
నాలుగైదు నెలల క్రితం తాను ఒక సర్వే నిర్వహించి ఫలితాలను వెల్లడించానని, తాజాగా ఐప్యాక్ నిర్వహించిన సర్వే నివేదిక ఆ సంస్థ ముగ్గురి డైరెక్టర్లలో ఒకరైన విశాల్ సంతకంతో వెలుగులోకి వచ్చిందని రఘురామ వెల్లడించారు. మాజీ మంత్రులు, మంత్రులు పోటీ చేయనున్న అసెంబ్లీ స్థానాలలో వెలువడనున్న ఫలితాల గురించి ఐప్యాక్ సర్వే నివేదికలో వెల్లడించారన్నారు. నాలుగైదు నెలల క్రితం తన సర్వే నివేదికలో వెల్లడించిన ఫలితాలే, ఐప్యాక్ సర్వే నివేదికలోనూ పునరావృత్తమయ్యాయని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో రోజా 36% ప్రజా ధరణ ఉండగా, టీడీపీకి 50 శాతం ప్రజాదరణ ఉన్నట్లు తాను గతంలో వెల్లడించానని గుర్తు చేశారు. రోజా గత ఎన్నికల్లో 2,700 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుతం 12 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యే అవకాశం ఉందన్నారు. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్వల్ప విజయావకాశాలు ఉన్నాయని గతంలో తన సర్వే నివేదిక ఆధారంగా పేర్కొన్నట్లు తెలిపారు. ఐప్యాక్ సర్వేలోనూ మూడు నుంచి నాలుగు వేల ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించే అవకాశం ఉందని చెప్పారన్నారు. మంత్రి దాడిశెట్టి రాజా గెలుస్తారని గతంలో తాను చెప్పానని, ఐ ప్యాక్ సర్వేలోనూ 1000 ఓట్ల తేడాతో విజయం సాధిస్తారని చెప్పారన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీకి 38% ప్రజా ధరణ ఉన్నట్టు, టీడీపీకి 50 శాతం ప్రజాధరణ ఉన్నట్లు తాను గతంలో పేర్కొన్నట్లు గుర్తుచేశారు. ఐప్యాక్ సర్వేలోనూ 2000 ఓట్ల తేడాతో మంత్రి ఓడిపోతారని నివేదికలో పేర్కొన్నారన్నారు. సర్వేపల్లి, తుని, కడపలోనూ తన అంచనాలు నియమయ్యయన్నారు.

యాత్రల ఎఫెక్ట్ ఇదే
రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారి పోనుందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. నారా లోకేష్ నిర్వహిస్తోన్న యువ గళం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించనున్న వారాహి యాత్ర, ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా నెలలో మూడు పర్యటనలు నిర్వహించడం ఖాయమన్నారు. యువ గళం, వారాహి యాత్ర, చంద్రబాబు పర్యటనల ప్రభావం ప్రజలపై తీవ్రంగా ఉండనుందన్నారు. యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్న నారా లోకేష్, వారాహి బస్సుయాత్ర చేపట్టనున్న పవన్ కళ్యాణ్ ఆశయం ఒక్కటేనని, ఈ దుష్ట ప్రభుత్వాన్ని గద్దె దించడమేనని రఘురామ పేర్కొన్నారు. దక్షిణ ఆంధ్ర నుంచి లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం కాగా, పవన్ కళ్యాణ్ వారాహి బస్సు యాత్ర ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభిస్తే బాగుంటుందన్నారు. త్వరలోనే వారాహి బస్సు యాత్ర ప్రారంభ తేదీని, వేదికను పవన్ కళ్యాణ్ ప్రకటిస్తామని చెప్పారన్నారు.

టీడీపీ-జనసేన పొత్తుతో తీవ్ర ప్రభావం
రాష్ట్ర ప్రజలను రక్షించాలనుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి తో జతకట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారని రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు. టీడీపీ, జనసేన జత కట్టడం వల్ల హోరా హోరి స్థానాలు కూటమి ఖాతాలోకే వెళ్తాయన్నారు. నాలుగైదు నెలల క్రితం సర్వే నిర్వహించినప్పుడు, హోరా, హోరి స్థానాలు దాదాపు 48 ఉండగా, అవన్నీ వైకాపా ఖాతాలోకే వెళ్తాయని భావించానని, టీడీపీ పక్కాగా 92 స్థానాలలో విజయం సాధిస్తుండగా, వైకాపా 29 స్థానాలలో పక్కాగా గెలుపొందనుందన్నారు. హోరా హోరి గా పోటీ జరిగే 48 స్థానాలు వైసీపీ ఖాతాలోకి వెళ్లినా.. ఆ పార్టీ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశాలు ఎంత మాత్రం లేవని స్పష్టం చేసినట్లు గుర్తుచేశారు. 175 స్థానాలకుగాను, 30 అసెంబ్లీ స్థానాలలో ఐ ప్యాక్ నిర్వహించిన సర్వే ఫలితాలు వెలుగులోకి వచ్చాయని, వీటిలో కేవలం 5 స్థానాలలో మాత్రమే ఆ పార్టీ విజయం సాధిస్తుందని సర్వే ఫలితాల ద్వారా వెళ్లడైందన్నారు. ఇదే ట్రెండు కొనసాగితే వైసీపీ 30 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందన్నారు.

జూలై-ఆగస్టులోనే ముందస్తు ఎన్నికలు ?
తాను గతంలో చెప్పినట్లుగానే ఈ ఏడాది జులై, ఆగస్టు మాసాలలో రాష్ట్ర అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రఘు రామ కృష్ణంరాజు పునరుద్ఘాటించారు. ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న విశ్వాసమే కాదు, తనకున్న పక్కా సమాచారం. నియంతృత్వ పోకడలు పోతున్న ఈ ప్రభుత్వాన్ని దించి, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే... డబుల్ ఇంజిన్ గా ప్రజల్లోకి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లు వెళ్లాలన్నారు. పార్టీలు వేరైనా, ఇద్దరి ఆశయం ఒక్కటే... ఆశయం ఒక్కటైనప్పుడు, ఇద్దరి అనుచరులు కూడా ఒక్కటవుతారన్నారు.












Click it and Unblock the Notifications