కారు జోరు, సైకిల్ స్పీడు: జయసుధ గట్టెక్కేనా
హైదరాబాద్: సికింద్రాబాద్ శాసన సభ నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ నెలకొంది. కాంగ్రెసు పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రముఖ నటి జయసుధ, టిడిపి తరపున కూన వెంకటేష్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున టి పద్మారావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున ఆదం విజయ కుమార్‌లు బరిలో ఉన్నారు. టిడిపి, కాంగ్రెసు, తెరాసల మధ్యనే ప్రధానంగా పోరు నెలకొని ఉంది. సికింద్రాబాదు నియోజకవర్గం భిన్నమైన కుల, మత, వర్గ, భాష, ప్రాంతం గల నియోజకవర్గం.
2009లో రాజకీయ ఆరంగేట్రం చేసిన జయసుధ తొలి అడుగులోనే టిడిపి అభ్యర్థి తలసాని శ్రీనివాస యాదవ్ పైన గెలుపొందారు. రెండోసారి గెలుపుపై ఆమె ధీమాతో ఉన్నారు. తలసానితో పోటీ పడ్డప్పుడు ఆమె విజయం సాధిస్తారని ఎవరూ ఊహించలేదు. నియోజకవర్గంలోని ఓ వర్గం ఓటర్లు ఆమెకు లాభించే అవకాశం. వివాదరహితురాలిగా ఉండటం, అవినీతి ఆరోపణలకు లేకపోవడం కలిసి వస్తుంది.

మరోవైపు తెలంగాణ ఉద్యమానికి మొదటి నుండి మద్దతు పలికారు. గత ఎన్నికల్లో ఆమె విజయానికి ప్రధాన కారణమైన ముస్లిం, క్రైస్తవ వర్గాల్లో సానుకూలత కూడా జయసుధకు కలిసి వచ్చే అంశం. అంతేకాక గతంలో ఆమె విజయానికి కృషి చేసిన కీలక నేతల్లో ఒకరిద్దరు మాత్రమే ఆమెకు మద్దతు పలుకుతున్నారు. ఎక్కువ మంది పార్టీ కార్పోరేటర్ల నుండి ఆమెకు మద్దతు లేదంటున్నారు.
నియోజకవర్గంలో టిడిపికి బలమైన కేడర్ ఉంది. కేడర్ బలమే తనకు విజయం సాధిస్తుందని కూన వెంకటేశ్ గౌడ్ ధీమాతో ఉన్నారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా మూడు సార్లు విజయం సాధించిన తలసాని శ్రీనివాస యాదవ్ ఈసారి సనత్ నగర్ నియోజకవర్గానికి మారారు. దీంతో కూన పోటీ చేస్తున్నారు. తలసాని అండతో పాటు బిజెపి సహకారం లాభిస్తుంది. మైనారిటీ ఓట్లను కాంగ్రెస్, జగన్ పార్టీ, తెరాస మజ్లిస్ పంచుకోవడం లాభిస్తుందని టిడిపి భావిస్తోంది.
తెలంగాణ నినాదంతో 2004లో ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన పద్మారావు మరోసారి బరిలో దిగారు. 2008లో తెలంగాణ కోసం రాజీనామా చేసి మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఉప ఎన్నికలో తలసాని చేతిలో ఓటమి పాలయ్యారు. 2009లో జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాక సనత్‌నగర్ నియోజకవర్గంనుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ సికింద్రాబాద్‌నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించడం కలిసి వస్తుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications