నారా లోకేష్‌తో జూ.ఎన్టీఆర్ చేతులు కలుపుతారా?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ ప్రస్తావనతో పార్టీలో నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర మరోసారి చర్చనీయాంశంగా మారింది. మాస్ ప్రజలను పార్టీ వైపు తేవడానికి చంద్రబాబు, బాలకృష్ణ, హరికృష్ణలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ప్రయత్నిస్తారని నారా లోకేష్ చెప్పడంతో అది చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీకి మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణతో పాటు ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ దూరమయ్యారని అందరూ నమ్ముతున్న సమయంలో లోకేష్ ప్రస్తావన సంచలనం సృష్టించింది.
జూనియర్ ఎన్టీఆర్‌తో నారా లోకేష్ రాజీ కుదుర్చుకున్నారా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. తెలుగుదేశం పార్టీ వారసత్వాన్ని చంద్రబాబు తన కుమారుడు నారా లోకేష్‌కు అప్పగించడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాల్లో భాగంగానే వారిద్దరు పార్టీ దూరమయ్యారని భావిస్తూ వస్తున్నారు. ఇప్పుడు, నారా లోకేష్ దాదాపుగా పార్టీ క్రియాశీలక పాత్రలోకి ప్రవేశించినట్లే భావిస్తున్నారు. నారా లోకేష్ పార్టీ యువత, విద్యార్థి విభాగాల నాయకులతో సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు.

తెలుగు యువత సారథ్య బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్ ఆశించినట్లు గతంలో ప్రచారం సాగింది. అయితే, ఆ అవకాశాన్ని నారా లోకేష్ లాగేసుకున్నట్లేనని భావిస్తున్నారు. ఈ స్థితిలో నారా లోకేష్‌తో జూనియర్ ఎన్టీఆర్ కలిసి పనిచేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ తమకు దూరం కాలేదని సంకేతాలు అందించడానికే నారా లోకేష్ వ్యూహాత్మకంగా ఆ ప్రకటన చేశారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
తన లక్ష్యం 2019 ఎన్నికలని, ఇప్పుడు మాత్రం చంద్రబాబును పీఠంపై కూర్చోబెడుతామని కూడా నారా లోకేష్ అన్నట్లు వార్తలు వచ్చాయ. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇప్పటికిప్పుడు సినిమాలను వదులుకుని రాజకీయాల్లో ప్రవేశించే పరిస్థితి లేదు. రామయ్యా వస్తావయ్యా సినిమాపై ఆయన బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఆశలకు తగినట్లుగా అది విజయం సాధించకపోవడం నిరాశనే మిగిల్చిందని అంటున్నారు. సినిమాలపై ఆయన మరింతగా శ్రద్ధ పెట్టాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు.
బాబాయ్ నందమూరి బాలకృష్ణతో పాటు ఇతర కుటుంబ సభ్యులకు దూరమైన ప్రభావం జూనియర్ ఎన్టీఆర్ సినిమాలపై పడుతోందనే ప్రచారం సాగుతోంది. తన సినిమాలు మరింతగా విజయం సాధించాలంటే సామరస్యం కుదుర్చోవడమే మార్గమని జూనియర్ ఎన్టీఆర్ ఆలోచిస్తూ ఉండవచ్చునని, ఈ స్థితిలో నారా లోకేష్ నుంచి ఆ ప్రకటన వచ్చిందని కూడా అంటున్నారు.
తాను తెలుగుదేశం పార్టీతోనే ఉంటానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పినప్పటికీ చంద్రబాబుతో మాత్రం ప్రచ్ఛన్న యుద్దం సాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలోనే నారా చంద్రబాబు నాయుడు నందమూరి హరికృష్ణను, జూనియర్ ఎన్టీఆర్‌ను పట్టించుకోవడం మానేశారని చెబుతున్నారు. అదే సమయంలో తన కుమారుడు నారా లోకేష్‌ను తెర మీదికి తేవడానికి వ్యూహాత్మకంగా పావులు కదిపారని, తన వియ్యంకుడు నందమూరి బాలకృష్ణను తనకు తోడుగా నిలబెట్టుకున్నారని అంటారు. ఈ స్థితిలో నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి పనిచేస్తారా అనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి.
కొసమెరుపు: కాగా, ఇటీవల నారా లోకేష్ చొరవ తీసుకుని నందమూరి, నారా కుటుంబాలకు చెందిన యువతను కలిపి సమావేశం ఏర్పాటు చేసినట్లు వినికిడి. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి, కాంగ్రెసు నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సంతానం కూడా హాజరైనట్లు ప్రచారం సాగింది. అయితే, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రాలేదు. ఆయనను ఆహ్వానించారా, లేదా అనేది తెలియదు.












Click it and Unblock the Notifications