జూ ఎన్టీఆర్ సేవలు వాడుకుంటాం - పవన్ పై పరోక్ష వ్యాఖ్యలతో : సోము వీర్రాజు సంచలనం..!!
మరోసారి బీజేపీలో జూనియర్ ఎన్టీఆర్ చర్చ బీజేపీలో తెర మీదకు వచ్చింది. బీజేపీ ఏపీ విభాగం అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం పైన పోరాటం గురించి వివరిస్తూ అమిత్ షా - జూనియర్ ఎన్టీఆర్ మధ్య సమావేశం పైన ఆయన స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత ప్రజాదరణ ఉందని చెప్పారు. భవిష్యత్ లో జూనియర్ ఎన్టీఆర్ సేవలను పార్టీ ప్రచారం కోసం వినియోగించుకుంటామంటూ సంచలనానికి తెర లేపారు.

బీజేపీ కోసం ఎన్టీఆర్ ముందుకొస్తారంటూ
జూనియర్ ఎన్టీఆర్ సేవలను తెలంగాణలో - ఏపీలో ఎక్కడ వినియోగించుకుంటారని ప్రశ్నించగా.. ఆయనకు ప్రజాదరణ ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడే వాడుకుంటామని తేల్చి చెప్పారు. పరోక్షంగా ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ సేవలను వినియోగించుంటామంటూ సోము స్పష్టం చేసారు. ఇదే సమయంలో మరిన్ని కీలక వ్యాఖ్యలు చేసారు.
చంద్రబాబుతో తమ వైఖరిలో మార్పు లేదన్నారు. కుటుంబ పార్టీలకు తమ పార్టీ దూరంగానే ఉంటుందని వెల్లడించారు. పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ఈ విషయం స్పష్టం చేసిందన్నారు. ఇక..జనసేనతో తమ పొత్తు ఉంటుందని చెబుతూనే..పరోక్షంగా కొన్ని కామెంట్స్ చేయటం ఇప్పుడు రాజకీయంగా సంచలనానికి కారణమవుతోంది. తాము పవన్ కళ్యాణ్ తో కలిసే ఉన్నామని చెప్పారు.

పవన్ ను ఉద్దేశించే వ్యాఖ్యలుగా ప్రచారం
అయితే, రాజకీయాలు కొంత మందే కాదు.. అందరూ చేస్తారంటూ సోము వీర్రాజు కీలక వ్యాఖ్య చేసారు. దీని ద్వారా కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ పొత్తుల్లో భాగంగా టీడీపీతో కలవాలనే విధంగా చేస్తున్న ప్రకటనలు..ప్రయత్నాల పైనే సోము వీర్రాజు ఈ విధంగా రియాక్ట్ అయినట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. టీడీపీకి దూరంగా ఉండాలని బీజేపి భావిస్తోందని.. పవన్ కళ్యాణ్ తిరిగి టీడీపీతో పొత్తు దిశగా ప్రకటన చేస్తే అప్పుడు అధికారికంగా స్పందిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు.
ఇక, ఇదే సమయంలో సోము వీర్రాజు యాక్టర్లు కానివారు ఎవరని ప్రశ్నించారు. దీని ద్వారా పవన్ కళ్యాణ్.. జూనియర్ ఎన్టీఆర్ యాక్టర్లే అనే విధంగా వ్యాఖ్యానించారు. సోము వీర్రాజు వ్యాఖ్యలతో అమిత్ షా..జూనియర్ ఎన్టీఆర్ ను బీజేపీ లోకి ఆహ్వానించారా.. జూ ఎన్టీఆర్ అందుకు సిద్దమేనా అనే మరో చర్చ మొదలైంది.

జూనియర్ క్లారిటీ ఇస్తారా..సస్పెన్స్ కొనసాగిస్తారా
తాజాగా.. బీజేపీ ఎంపీలు జీవీఎల్ నర్సింహా రావు.. తెలంగాణ ఎంపీ లక్ష్మణ్ సైతం అమిత్ షా - జూ ఎన్టీఆర్ మధ్య రాజకీయంగా చర్చ జరిగిందని వెల్లడించారు. మాజీ మంత్రి కొడాలి నాని సైతం జూనియర్ సేవలను బీజేపీ దక్షణాది రాష్ట్రాల్లో ప్రచారం కోసం వినియోగించుకొనే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసారు. ఇక, ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడి హోదాలో సోము వీర్రాజు..తాము జూనియర్ ఎన్టీఆర్ సేవలు వినియోగించుకుంటామని చెప్పటం ద్వారా.. పవన్ కళ్యాణ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.ఈ వ్యాఖ్యలపై తారక్ ఇప్పటికైనా స్పందిస్తారా..లేక మరి కొంత కాలం ఈ సస్పెన్స్ కంటిన్యూ చేస్తారా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications