టీడీపీ వస్తే వాలంటీర్లు, సచివాలయాలు ఎత్తేస్తారా ? తేల్చేసిన లోకేష్.. !
ఏపీలో ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉంది. ఎన్నికల్లో ప్రస్తావించాల్సిన అంశాల్ని అన్ని పార్టీలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో సంక్షేమ పథకాలు, రాజధాని వంటి అంశాలతో పాటు మరో కీలక అంశం కూడా ఉంది. అది వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్ధను కొనసాగిస్తారా లేదా అనేది. దీనిపై ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చేసిన టీడీపీ ఇప్పుడు మరోసారి స్పష్టత ఇచ్చింది.
ఏపీలో అధికార వైసీపీపై వ్యతిరేకత పెరుగుతున్న వేళ.. దాన్ని సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీకి ఇప్పుడు ఓ అడ్డంకి ఎదురవుతోంది. అదే ప్రస్తుతం కొనసాగుతున్న సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్ధ. వీటిని వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మార్చేసుకున్నారు. వీటిని కొనసాగిస్తామన్న హామీ లభిస్తే తప్ప వారిలో కొందరైనా టీడీపీవైపు మొగ్గు చూపే అవకాశం లేదు. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో విపక్షానికి సమస్యలు తప్పవు. ఈ నేపథ్యంలో టీడీపీ దీనిపై దృష్టిసారించింది.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే సచివాలయాలు, గ్రామ, వార్డు వాలంటీర్లను తొలగిస్తారనే ప్రచారాన్ని వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు జనంలోకి తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్.. దీనిపై స్పష్టత ఇచ్చారు. ముఖ్యంగా తమ పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాల్ని ప్రకటిస్తూనే అందులో వాలంటీర్లు, సచివాలయాల గురించి ప్రస్తావించారు.
వచ్చే ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, పల్లె సీమల్లో స్వర్ణయుగం తీసుకువస్తామని తాజాగా పాదయాత్రలో లోకేష్ తెలిపారు. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్ధల్ని కొనసాగిస్తామన్నారు. గ్రామాల్లో సర్పంచ్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఎమ్మెల్యేలు సమష్టిగా పనిచేస్తే గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమన్నారు.
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, ఎమ్మెల్యేలు సైతం దిష్టిబొమ్మలుగా మారారని లోకేష్ తెలిపారు. అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదన్నారు. ఈ విధానం మారాలంటే సచివాలయ వ్యవస్థను పంచాయతీలకు అనుసంధానం చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications