సమైక్యవాదమే: జగన్ విభజనను అడ్డుకుంటారా?
హైదరాబాద్: తన సమైక్యవాద నినాదంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ రాష్ట్ర విభజనను అడ్డుకుంటారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. సీమాంధ్ర నాయకులు మాత్రం జగన్ సమైక్యాంధ్రను కాపాడుతారని గట్టిగా చెబుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జగన్ అడ్డుకోగలరనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగన్ విడుదల రాష్ట్ర సమైక్యతా పరిరక్షణకు ఉపయోగపడుతుందని అంటున్నారు.
జగన్ విడుదలతో సమైక్యోద్యమం మరింత బలపడుతుందని, జగన్ తన శక్తియుక్తులను ధారపోసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేస్తారని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు గాదె వెంకటరెడ్డి అన్నారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనే నమ్మకం ఉందని ఆయన అన్నారు. జగన్ విడుదల సమయంలో సీమాంధ్ర నాయకులు అదే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యుడు మదుసూదన్ గుప్తా కూడా అదే అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఈ స్థితిలో సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల ఫోరం నాయకులు బుధవారం ఉదయం జగన్‌త సమావేశమయ్యారు. సమైక్య ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని వారు జగన్‌ను కోరారు. వచ్చే ఎన్నికలు సమైక్యాంధ్రలోనే జరుగుతాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి అంటున్నారు.
సమైక్య శంఖారావం పేరుతో జగన్ సోదరి వైయస్ షర్మిల ఇప్పటికే సీమాంధ్రలో పర్యటన చేశారు. జగన్ కూడా కోర్టు అనుమతి పొంది సీమాంధ్రలో పర్యటిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమానికి జగన్ విడుదల బలాన్ని చేకూరుస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు.
సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని వైయస్ జగన్ పనిచేస్తారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీని దెబ్బ తీయడమే జగన్ ప్రధాన లక్ష్యంగా ఉంటుందని అంటున్నారు. అందుకే, జగన్‌కు బెయిల్ రావడంపై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ప్రతిస్పందించినట్లు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా జగన్‌కు బెయిల్ రావడంపై సిబిఐని తప్పు పట్టారు. కాంగ్రెసు ప్రోద్బలంతో సిబిఐ జగన్‌పై కేసులను నీరు గార్చిందని ఆయన విమర్శించారు. ఏమైనా, జగన్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారా, సమైక్య నినాదంతో సీమాంధ్రలో సత్తా చాటుకుంటారా అనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications