జగన్ సోషల్ ఇంజనీరింగ్ రిపీట్ అయ్యేనా ? విపక్షాల ఐక్యత దెబ్బ-కొత్త వ్యూహాలపై చూపు ?
ఏపీలో 2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి పనికొచ్చిన వ్యూహాల్లో వైఎస్ జగన్ సోషల్ ఇంజనీరింగ్ కూడా ఒకటి. గతంలో యూపీలో అధికారంలోకి రావడానికి మాయావతి కూడా ఇలాంటి వ్యూహాన్నే అనుసరించారు. అయితే ఆ తర్వాత ఎన్నికలకు పరిస్దితి మొత్తం తిరగబడింది. ఇప్పుడు ఏపీలోనూ వైఎస్ జగన్ తన పాత వ్యూహాన్ని రిపీట్ చేయబోతున్నారా లేక మరో కొత్త వ్యూహంపై కసరత్తు చేస్తున్నారా అన్నది ఇంకా తేలలేదు.

జగన్ సోషల్ ఇంజనీరింగ్
కుల సమీకరణాలకు పెట్టింది పేరైన ఏపీలో వాటిని తనకు అనువుగా మార్చుకోవడంలో వైఎస్ జగన్ సక్సెస్ అయ్యారు. 2014 ఎన్నికల నాటికే కులాలపై ఓ అవగాహనకు వచ్చేసిన జగన్, 2019 నాటికి తన వ్యూహాలకు మరింత పదునుపెట్టడం ద్వారా సోషల్ ఇంజనీరింగ్ ను పక్కాగా అమలు చేశారు. దీంతో ఇతర అంశాల్లాగే కుల సమీకరణాలు కూడా తనకు పూర్తిగా అనుకూలించడమే కాదు అధికారంలోకి వచ్చేలా చేశాయి. అధికారంలోకి వచ్చాక కూడా కులాలపై ఎక్కువగా చర్చ జరగకుండా చూసుకోవడంలో జగన్ సక్సెస్ అయ్యారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇదే వ్యూహం జగన్ రిపీట్ చేయబోతున్నారా లేదా అన్న చర్చ జరుగుతోంది.

2024లోనూ రిపీట్ చేస్తారా ?
2019లో అనుసరించిన సోషల్ ఇంజనీరింగ్ వ్యూహం జగన్ కు మంచి ఫలితాల్నే అందించింది. అంతే కాదు అధికారంలోకి వచ్చాక కూడా కులాల గురించి ఎక్కువగా చర్చ లేకుండా చేసింది. అయితే ఇదే వ్యూహం 2024లో రిపీట్ చేస్తారా లేదా అన్న చర్చ ఎక్కువగా సాగుతోంది. దీనికి ప్రధాన కారణం కులాల విషయంలో గతానికి ఇప్పటికీ క్షేత్రస్దాయిలో వస్తున్న మార్పులే. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో అధికారం దక్కని కులాలు, అధికారం దక్కినట్లే దక్కి కోల్పోయిన కులాలు, పదవులు ఇచ్చినట్లే ఇచ్చి అధికారం ఇవ్వని కులాలు చాలానే కనిపిస్తున్నాయి. ఆయా కులాల్లో రేగుతున్న అసంతృప్తికి తోడు విపక్షాల ఐక్యత కూడా వైసీపీకి తలనొప్పిగా మారుతోంది.

ఈ కులాల్లో అసంతృప్తి
రాష్ట్రంలో బీసీల్లోని గ్రామీణ నేపథ్యం ఉన్న కులాల్లో చాలా మటుకు వైసీపీ ప్రభుత్వంలో అధికారానికి దూరంగా ఉండిపోయాయి. పట్టణ నేపథ్యం ఉన్న అతి తక్కువ కులాలకు మాత్రమే అధికారం, పదవులు అన్నీ దక్కాయి. దీంతో ఆయా కులాలన్నీ ఇప్పుడు మళ్లీ గతంలో తాము అండగా నిలిచిన టీడీపీవైపు చూస్తున్నాయి. అలాగే కాపులు కూడా వారికి ఇచ్చిన హామీలు అమలుకాకపోవడం, రిజర్వేషన్ పై చంద్రబాబు చేసిన ప్రయత్నాలు కూడా జగన్ చేయకపోవడం వంటి కారణాలతో జగన్ కు దూరం జరుగుతున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గతంతో పోలిస్తే యాక్టివ్ కావడం, బీజేపీ కూడా కాపు అజెండాతో ముందుకెళ్తుండటంతో ఆ సామాజిక వర్గం ఇప్పుడు వారివైపు చూస్తోంది. ఇలా పలు కులాల్లో ఇప్పుడు వైసీపీపై అసంతృప్తి పెరుగుతోంది.

జగన్ కొత్త వ్యూహం వెతుక్కోవాల్సిందే ?
రాష్ట్రంలో గతంలో జగన్ అమలుచేసిన సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములా విపక్షాలను, ముఖ్యంగా టీడీపీని కకావికలు చేసింది. దశాబ్దాలుగా టీడీపీని అంటిపెట్టుకున్న బీసీలు దూరమయ్యారు. కానీ ఇప్పుడు అవే కులాల్లో పెరుగుతున్న అసంతృప్తిని సంతృప్తిగా మార్చే మంత్రదండం జగన్ వద్ద కనిపించడం లేదు. అలాగే పవన్ వైపు మొగ్గుతున్న కాపుల్ని అడ్డుకునే వ్యూహాలు కూడా కనిపించడం లేదు. దీంతో కొత్తగా మరో వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాల్సిన పరిస్దితి జగన్ కు ఎదురవుతోంది. మరి జగన్ కుల సమీకరణాల వడపోతకు మరోసారి సిద్ధమవుతారా లేక రాజధానుల చర్చతో దీన్ని పక్కనబెట్టేస్తారా అన్నది త్వరలో తేలిపోనుంది.












Click it and Unblock the Notifications