Video: డోలీలో మోసుకుంటూ వెళ్లి ఓటేసిన గిరిజనులు... చూసి సిగ్గు తెచ్చుకోవాలన్న నెటిజన్లు
ఓటు సామాన్యుడి వజ్రాయుధం. తమని పాలించే, తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోవడానికి ఐదేళ్లకొకసారి వచ్చే సువర్ణ అవకాశం కానీ ఈ సువర్ణ అవకాశాన్ని చాలామంది వినియోగించుకోవడం లేదు. ఫలితంగా అనేక ప్రాంతాలలో పోలింగ్ శాతం తగ్గుతుంది. ముఖ్యంగా విద్యావంతులు ఉన్నచోట పోలింగ్ శాతం గణనీయంగా తగ్గుతుంది అంటే పరిస్థితి ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు.
ఓటేయని బద్దకస్తులకు కనువిప్పు కలిగించే ఘటన
ఏ చదువు సంధ్యాలేని కుగ్రామాలకు చెందినవారు, ఏజెన్సీ గ్రామాలకు చెందిన వారు తమకు దూరంగా ఉన్నప్పటికీ పోలింగ్ కేంద్రాలకు నడిచి వెళ్లి ఓట్లు వేస్తుంటే, అన్ని సౌకర్యాలు ఉండి, అందుబాటులోనే పోలింగ్ కేంద్రం ఉండి ఓట్లు వేయని విద్యావంతులు ఎందరో. ఇక అటువంటి వారికి కనువిప్పు కలిగే ఒక ఉదంతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

డోలీలలో మోసుకుంటూ ఓటేసేందుకు వెళ్ళిన గిరిజనులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకున్న ఒక ఘటన ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న గిరిజనులు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అటవీ మార్గంలో గుట్టలలోంచి నడుస్తూ ఓటు వేసేందుకు వెళ్లారు. అంతేకాదు అటవీ మార్గంలో ప్రయాణం చేయలేని వృద్ధులను, ఆడవారిని డోలీలలో మోసుకుంటూ ఓట్లు వేయడానికి తీసుకువెళ్లారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
అటవీ మార్గంలో డోలీలో వచ్చి మరి ఓటేసి తమ ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుకున్నారు. ఏ చదువు లేని గిరిజనులు ప్రస్తుతం అటవీ మార్గంలో డోలీలో మోసుకుంటూ ఓ మహిళను పోలింగ్ కేంద్రానికి తీసుకు వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో పై నెటిజెన్లు ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు.
వాళ్ళను చూసైనా వెళ్లి ఓటేసి రండి
ఓటు వేయండి మహా ప్రభో అంటే ఓటు వేయడానికి బద్దకించే ఓటర్లు ఉన్న నేటి రోజుల్లో ఐదేళ్ల కు ఒకసారి వచ్చే ఎన్నికలలో తమ ఓటు హక్కు ద్వారా భవిష్యత్తుకు పునాది వేయాలని ఏమీ తెలియని గిరిజనులు సైతం భావించి వ్యయ ప్రయాసలకోర్చి ఓటు వేశారని వారికి కితాబిస్తున్నారు. వీళ్లను చూసైనా ఓటు వేయని బద్ధకస్తులు, ఓటు వేయని నగర ప్రాంత విద్యావంతులలో మార్పు రావాలని కోరుతున్నారు. వాళ్ళను చూసి అయినా సిగ్గు తెచ్చుకోవాలని అంటున్నారు.












Click it and Unblock the Notifications