జగన్ బెదిరింపులకు లొంగబోం-అమరావతి ప్లాన్ ఇదే- చంద్రబాబు కామెంట్స్..!
ఏపీలో అమరావతి రాజధాని అభివృద్ధితో పాటు మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ప్రైవేటీకరణ వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు ఇవాళ ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఓ ప్రైవేట్ కాంక్లేవ్ లో పాల్గొన్న సందర్భంగా చంద్రబాబు రాష్ట్రంలో పరిణామాలపై స్పందించారు. అమరావతిలో మొత్తం ప్రైవేట్ భూములేనని, హైటెక్ సిటి రాక ముందు హైదరాబాద్ ఎకరం రూ.లక్ష ఉండేది.. ఇప్పుడు రూ.100 కోట్లకు చేరిందని చంద్రబాబు గుర్తుచేశారు. పరిశ్రమలు, అభివృద్ధితో భూమి విలువ పెరుగుతుందన్నారు. అమరావతి రైతులకు అన్యాయం జరగదన్నారు.
అమరావతి అభివృద్ధి అనేది కంటిన్యూగా ఉంటుందని చంద్రబాబు తెలిపారు. అభివృద్ధిని కొంత మేరకే పరిమితం చేస్తే... అమరావతి ఓ చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుందన్నారు. హైదరాబాద్ తరహాలో అమరావతి కూడా మహానగరంగా మారుతుందన్నారు. గుంటూరు-విజయవాడ-తెనాలి-గ్రామాలు కలిస్తేనే మహానగరంగా మారుతుందన్నారు. భూములిచ్చిన వారిని ఆదుకుంటామన్నారు. విస్తరణ విషయంలోనూ ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పుడు ఉండే భూమి ఇప్పటికే సరిపోతుందని, అవసరమైన మేరకు రైతులతో మాట్లాడి అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు.

అమరావతిలో క్వాంటం వ్యాలీకి శ్రీకారం చుట్టామని, క్వాంటం కంప్యూటింగ్ కు అవసరమైన అనుబంధ సంస్థలు పెట్టడానికి పలు సంస్థలు ముందుకు వచ్చాయని చంద్రబాబు తెలిపారు. అలాగే జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ విద్యా సంస్థలు కొన్ని ఉన్నాయని, ఇంకొన్ని రాబోతున్నాయన్నారు. ఒకప్పుడు రాయలసీమలో 10 ఏళ్లల్లో 8 ఏళ్లు కరవు ఉండేదని, ట్యాంకర్లల్లో నీళ్లు తీసుకెళ్లాల్సిన పరిస్థితి రాయలసీమలో ఉండేదని చంద్రబాబు గుర్తుచేశారు. దేశంలో ఇప్పటికీ అతి తక్కువ వర్షపాతం ఉన్న జిల్లా అనంతపురమని, కానీ నీళ్లను ఇవ్వడంతో అక్కడ పరిస్థితి మారిందన్నారు.కోస్తా జిల్లాల కంటే అనంతపురం జిల్లానే జీఎస్డీపీలో టాప్ పొజిషన్లో ఉందన్నారు. హార్టికల్చర్ సాగు వల్లే ఇది సాధ్యమైందన్నారు.

నీళ్లు లేకపోయినా ఫర్వాలేదు, రోడ్లు లేకపోయినా ఫర్వాలేదంటే మనం ఇక్కడే ఉంటామని చంద్రబాబు తెలిపారు. పైగా వృధా జలాలను మాత్రమే బనకచర్లకు వినియోగించుకుంటామని చెబుతున్నట్లు తెలిపారు. పెద్ద పెద్ద సంస్థలన్నీ సొంత డబ్బులతో పెడుతున్నారా...? బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకుంటున్నారని, పెట్టుబడులు పెడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం కూడా అదే తరహాలో ప్రాజెక్టులు చేపడుతోందన్నారు. చిన్న చిన్న విషయాల్లో ఆలోచనలతోనే ఆపేస్తే ఇక్కడితోనే ఆగిపోతామన్నారు.

ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో నాడు తాను తీసుకున్న నిర్ణయాల వల్లే రైతు కూలీల పిల్లలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు అయ్యారని చంద్రబాబు తెలిపారు. మెడికల్ కాలేజీలు కట్టకుండా, కట్టేశామని చెబుతున్నారని జగన్ పై విమర్శలు గుప్పించారు. తాము ప్రైవేట్ వారికి అప్పజెప్పడం లేదని, పీపీపీ పద్దతినే నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరగదన్నారు. నిర్వహణ ప్రభుత్వానిదేనన్నారు. వైద్య విద్యార్థులకు, వైద్య సేవలకు ఇబ్బంది రాకుండా చేసే బాధ్యత తమ ప్రభుత్వానిది అన్నారు. ఏదో బెదిరింపులు చేస్తే బెదిరిపోయే పరిస్థితి రాదన్నారు.












Click it and Unblock the Notifications