రాజకీయం ముసుగులో నేరాలు చేస్తే వదలం..! బాబు వార్నింగ్..! ఏడాది పాలనపై సభ..!
ఏపీలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న కూటమి సర్కార్.. ఇవాళ అమరావతిలో సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. పొలిటికల్ గవర్నెన్స్ కింద ఉమ్మడి మ్యానిఫెస్టో ఇచ్చామని, ప్రజలు కూటమిపై అభిమానంతో గెలిపించారన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులపై ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్డీయే డబుల్ ఇంజన్ ప్రభుత్వాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ఏడాదిలో చేసి చూపించామన్నారు. కేంద్రం సాయం లేకపోతే ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్ధితి ఉంటుందన్నారు.
విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడతాం, పునర్మిర్మాణ దిశగా ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చామని, అందులో ఇది తొలి అడుగు అన్నారు. అన్నీ చేసేశామని చెప్పను కానీ, ఊహించిన దాని కంటే ఎక్కువ చేశామన్నారు. సీఎం పదవి తనకు కొత్త కాదని, ఇంత కంటే క్లిష్టమైన సందర్భాల్లో తాను సీఎంగా పనిచేశానన్నారు. 1994లో జీతాలివ్వలేని స్దితిలో ఉన్న ప్రభుత్వాన్ని నడిపించానన్నారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కూర్చోవడానికి చోటు లేకపోతే బస్సులోనే పాలన ప్రారంభించానన్నారు. అక్కడి నుంచి నిలదొక్కుకునేందుకు ప్రయత్నించామన్నారు.

సాధారణంగా ప్రభుత్వాన్ని ఒక్క పార్టీ ఉంటేనే సమస్యలు ఉంటాయని, అలాంటిది మూడు పార్టీలు ఉన్నా ఎలాంటి సమస్యలు లేకుండా ఏడాది పాలన పూర్తి చేసుకోవడానికి పవన్ కళ్యాణ్, బీజేపీలే కారణమని చంద్రబాబు తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు ఆకాంక్షల నుంచి అభివృద్ధి వరకూ ఉందన్నారు. చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్డీయే కూటమి పనిచేస్తుందన్నారు. అది చేసే బాధ్యత ఇక్కడ ఉన్న యంత్రాంగంపై ఉందన్నారు.
గత వైసీపీ పాలనలో దుష్పరిపాలన నుంచి జనం భారీ మెజార్టీతో అధికారం ఇచ్చేవరకూ ఏం జరిగిందో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. 2022 నాటికి రాష్ట్రానికి ఇక అప్పులు చేసే పరిస్ధితి లేదని నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చిందని, రాష్ట్రంలో నిధులు భారీగా దుర్వినియోగం చేయడం, మళ్లించడం చేశారన్నారు. ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి వైసీపీ పాలన శరాఘాతంగా మారిందన్నారు. ఇప్పుడు వాటిని సరిదిద్దే పనిలో ఉన్నట్లు చంద్రబాబు తెలిపారు. గత వైసీపీ పాలనలో సోలార్, పవన విద్యుత్ పేరిట భారీగా నిధులు దుర్వినియోగం చేశారన్నారు.
రాష్ట్రంలో కూటమి ఇచ్చిన హామీల అమలు, కేంద్రం నుంచి అందుతున్న సాయంపై వివరాలను చంద్రబాబు వెల్లడించారు. 31 పారిశ్రామిక పాలసీల్ని తీసుకొచ్చామని, ఇవాళ మరో రెండు పాలసీలు తెస్తున్నామని తెలిపారు. ఈగల్, శక్తి టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో తీవ్రవాదం, ముఠాల్ని లేకుండా చేసిన పోలీసు అధికారులు ఉన్నారని వారు ఇప్పుడు అదే స్దాయిలో పనిచేయాలన్నారు. గంజాయిని దాదాపుగా నిర్మూలించామని, ఎవరైనా గంజాయి పెంచినా, సేవించినా అదే చివరి రోజవుతుందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడాలని, ఆడబిడ్డలకు రక్షణ ఉండాలన్నారు.

రాజకీయ ముసుగులో నేరాలు చేయాలని చూస్తే ఈ రాష్టంలో కుదరదని చంద్రబాబు హెచ్చరించారు. ఈ విషయంలో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గతంలో తాను ఏడు రంగాలపై శ్వేతపత్రాలు ప్రకటించామన్నారు. ఆయా రంగాల్లో ప్రక్షాళన ప్రారంభించి ఏడాదిలో మెరుగైన ఫలితాలు సాధించామన్నారు. గతంలో ప్రభుత్వ భూముల్ని వాడి సైబరాబాద్ నిర్మించామని, అమరావతిలో ప్రభుత్వ భూములు లేకపోయినా ప్రజల సహకారంతో రాజధాని నిర్మిస్తున్నట్లు తెలిపారు.
మూడేళ్లలో అమరావతి పనులు పూర్తి చేస్తాం, మళ్లీ వచ్చి ప్రారంభించాలని ప్రధాని మోడీని కోరామన్నారు. 2027 జూన్ లేదా డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి చేస్తామన్నారు. బనకచర్ల రాష్ట్రానికి గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు. తెలంగాణ కూడా ఈ నీటిని వాడుకోవచ్చన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను కూడా వేగంగా అమలు చేస్తున్నామన్నారు. ఉచిత బస్సు పథకంతో పాటే ఆటోడ్రైవర్లను ఆదుకునే కార్యక్రమం ప్రకటిస్తామన్నారు.పీ4 కార్యక్రమం విజయవంతం కోసం అందరూ సహకరించాలన్నారు. రాష్ట్రంలో ఏడాదిలో 9.34 కోట్ల పెట్టుబడుల ఆకర్షణ ద్వారా 8.5 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications