జగన్ పిలుపు వెనుక ప్లాన్ అదే-యనమల రామకృష్ణుడు హింట్..!
ఏపీలో కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా డిసెంబర్ 11, 27, జనవరి 3వ తేదీల్లో రాష్ట్రవ్యాప్త నిరసనలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. దీనిపై ఇవాళ టీడీపీ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ నిరసనల పిలుపు వెనుక ఉన్న కారణాల్ని ఆయన వెల్లడించారు. అదే సమయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని యనమల కోరారు. ఇంతకీ జగన్ ఇచ్చిన పిలుపు ఏంటి ?, దానికి యనమల కౌంటర్ ఏంటో ఓసారి చూద్దాం..
డిసెంబరు 11న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్ల కార్యాలయాల వద్ద వైయస్సార్సీపీ రైతుల ప్రదాన సమస్య అయిన ధాన్యం సేకరణలో అన్యాయం, కనీస మద్ధతు ధర కల్పన డిమాండ్లతో పాటు పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న రూ.20వేల ఇవ్వాలని డిమాండ్ చేయాలని జగన్ పిలుపునిచ్చారు. వీటితో పాటు ఇప్పటివరకు రైతులకు అందుతున్న ఉచిత పంటల బీమాను రైతులకు వర్తింప జేయాలన్న డిమాండ్ తో రైతులతో కలిసి ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వబోతున్నారు.

ఆ తర్వాత చంద్రబాబు సర్కార్ కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు కార్యక్రమానికి నిరసనగా డిసెంబరు 27న ఆందోళన చేపట్టాలని జగన్ మరో పిలుపునిచ్చారు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని ఇచ్చిన హామీ విస్మరించి పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించమని, జనవరిలో పెంచబోయే కరెంటు ఛార్జీలు కూడా తగ్గించమని డిమాండ్ చేయనున్నారు. ఇప్పటికే రూ.6వేల కోట్ల బాదుడుతో పాటు, మరో నెలలో మరో రూ.9వేల కోట్ల ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని డిమాండ్ చేస్తూ జిల్లాల్లో ఎస్‌ఈ కార్యాలయాలతో పాటు, సీఎండీ కార్యాలయాల వద్ద ప్రజల తరపున, ప్రజలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించమని వినతి పత్రాలు ఇస్తారు. అలాగే జనవరి 3న అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆందోళన చేపట్టనున్నారు.
దీనిపై యనమల తీవ్రంగా స్పందించారు. జగన్ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించేందుకే ఇలా నిరసనలకు పిలుపునిచ్చారని యనమల తెలిపారు. గతంలో ఆయన తండ్రి వైఎస్ కూడా చెన్నారెడ్డి హయాంలో ఇలాంటి పనులే చేశారని ఆరోపించారు. జగన్ పిలుపు హాస్యాస్పదంగా ఉందని, వైసీపీ హయాం సమస్యల్ని తమ ప్రభుత్వానికి అంటగట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ఆయన అరాచక పాలనను ఆరు నెలల క్రితమే ప్రజలు తిరస్కరించిన విషయాన్ని గుర్తించాలని యనమల కోరారు.












Click it and Unblock the Notifications