తారక్ ను రెచ్చగొడితే వాళ్లకే నష్టం - యార్లగడ్డ కీలక వ్యాఖ్యలు..!!
నందమూరి బాలకృష్ణ తాజాగా తారక్ ఫ్లెక్సీలు తొలిగించని చెప్పటం వివాదంగా మారింది. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఈ ఫ్లెక్సీల తొలిగింపు ఈ వ్యవహారం పైన వైసీపీ నేత కొడాలి నాని సీరియస్ గా స్పందించారు. లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేసారని ఆరోపించారు. ఇటు తారక్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశం పై నందమూరి కుటుంబానికి సన్నిహితుడుగా పేరున్న మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేసారు.
బాబాయ్ వర్సస్ అబ్బాయ్:ఎన్టీఆర్ వర్దంతి వేళ నందమూరి కుటుంబలో వివాదం తెర మీదకు వచ్చింది. కొంత కాలంగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో టీడీపీ నేతలు కొందరు జూనియర్ ఎన్టీఆర్ లక్ష్యంగా విమర్శలు ప్రారంభించారు. వీటి పైన తారక్ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు.

టీడీపీ సభల్లో తారక్ అనుకూల నినాదాలు, జెండాల ప్రదర్శనలతో అభిమానులు నినాదాలు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో జూఎన్టీఆర్ తన సోదరుడుతో కలిసి నివాళి అర్పించారు. ఆ కాసేపటికే అక్కడకు వచ్చిన బాలకృష్ణ అప్పటికే అక్కడ జూఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలిగించాలని ఆదేశించారు. వాటి తొలిగింపుతో వివాదం మొదలైంది.
యార్లగడ్డ కీలక వ్యాఖ్యలు:దీని పైన పలువురు స్పందించారు. ఈ సమయంలో జూ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ కు సన్నిహితుడైన రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలిగిస్తే ఆయనకు వచ్చే నష్టమేమీ లేదని వ్యాఖ్యానించారు. తారక్ స్థాయిని ఎవరైనా తగ్గించాలని అనుకుంటే ఆకాశం పైన ఉమ్మేసినట్లేనని కీలక వ్యాఖ్యలు చేసారు.
ఎవరైనా తారక్‌ని తిట్టినా, అగౌరవపరిచినా.. వాళ్లకే నష్టమని తేల్చి చెప్పారు. తారక్ ఆ స్థాయికి చేరటం వెనుక కారణం ఆయన తల్లి షాలిని అని చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో టీడీపీ నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారని విమర్శించారు. ఇదే సమయంలో లోకేష్ వివాహ పైన ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.
లోకేష్ వివాహం పైనా:గతంలో బాలకృష్ణ కూతురిని లోకేష్‌కి ఇచ్చి పెళ్లి చేస్తున్నారా అని తాను చంద్రబాబును అడిగిన అంశాన్ని గుర్తు చేసారు. దీనిపై సీరియస్‌గా స్పందించిన చంద్రబాబు 'నాన్సెన్స్' అని తనతో అన్నారని వెల్లడించారు. మేనరికం సంబంధాలు మంచివి కాదని ఆ సందర్భంగా ఆయన చెప్పారని వివరించారు. అయితే ఆ తర్వాత లోకేష్‌కి బాలకృష్ణ కూతురిని ఇచ్చి చంద్రబాబు వివాహం చేశారని వివరించారు.
దీనికి కొనసాగింపుగా సీఎం జగన్ పైన ప్రశంసలు కురిపించారు. తాను మంచి చేస్తేనే ఓటు వేయండని ధైర్యంగా చెప్పిన ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చెప్పారు. అలాంటి నాయకుడు దేశంలో మరొకరు లేరని ఆయన తెలిపారు. దేశానికి ఒక ఐకాన్ అయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని చెప్పారు.












Click it and Unblock the Notifications