తహసిల్దార్ ఫోర్జరీ సంతకంతో టాయిలెట్ భూమి కబ్జా, వైసీపీ లీడర్ కు జైలు శిక్ష
ఆంధ్ర ప్రదేశ్ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాలలో జగన్ అండతో పలు జిల్లాల్లో ప్రభుత్వ భూములు, ప్రైవేట్ వ్యక్తుల భూములు వైసీపీ నాయకులు కబ్జాలు చేశారని ఆ పార్టీ నాయకులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు వైసీపీకి చెందిన కొందరు నాయకులు కొట్టేశారని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు.
పలు జిల్లాల్లో వైసీపీ నాయకులు కబ్జా చేసిన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని సంబంధిత అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. పోరంబోకు భూములు, కాలువ పురంబోకు భూములు, డీకేటీ భూములను వైసీపీ నాయకులకు కబ్జా చేశారని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు గత మూడు సంవత్సరాల నుంచి ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

అయితే స్థానికులు అవసరాల కోసం టాయిలెట్లు నిర్మించడానికి ప్రభుత్వం కేటాయించిన భూమిని కూడా ఓ వైసీపీ నాయకుడు కబ్జా చెయ్యడంతో ఆయన జైలుకు వెళ్లడం కలకలం రేపుతుంది. మరుగుదొడ్ల నిర్మాణం కోసం పంచాయితీ కేటాయించిన స్థలాన్ని కబ్జా చెయ్యడమే కాకుండా స్థానిక తహసిల్దార్ సంతకం ఫోర్జరీ చేసి ఆ స్థలంలో ఇల్లు నిర్మించడానికి పూర్తిగా సహకరించిన వైసీపీ నాయకుడు జైలుకు వెళ్లాడు.
పంచాయతీ పరిధిలో సామూహిక మరుగుదొడ్లు నిర్మించడానికి గత ప్రభుత్వమే నిధులు మంజూరు చేసింది. పంచాయతీకి చెందిన భూమిని గుత్తి లలితమ్మ అనే మహిళ ఆక్రమించుకుంది. లలితమ్మ కు పూర్తి సహకార సహకారాలు అందించిన ఆ వైసీపీ నేత భూమి కబ్జా విషయంలో జోక్యం చేసుకున్నాడు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆవుకి మండలంలోని శివవరం పంచాయితీ పరిధిలో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం కోసం పంచాయితీ స్థలాన్ని కేటాయించారు.

శివవరం గ్రామస్తులు ఈ విషయంపై రెవెన్యూ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ తహసిల్దార్ ప్రసాద్బాబు ఆ పట్టా పరిశీలించగా తహసిల్దార్ సంతకం ఫోర్జరీ అయ్యిందని వెలుగు చూసింది. డిప్యూటీ తహసిల్దార్ హరిప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసి వైసీపీ నాయకుడు సుబ్బారెడ్డి, ఇల్లు కట్టుకున్న లలితమ్మను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరిచారు.
కేసు వివరాలు తెలుసుకున్న న్యాయస్థానం సుబ్బారెడ్డిని ఆళ్లగడ్డ సబ్ జైలుకి, లలితమ్మను నంద్యాల సబ్ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. టాయిలెట్ల భూమిని వైసీపీ నాయకుడు సుబ్బారెడ్డి కబ్జా చేశారని వెలుగు చూడడం, ఆ లీడర్ కు జలు శిక్ష పడటం ఇప్పుడు కర్నూల్ జిల్లాలో కలకలం రేపుతుంది. మొత్తం మీద పలు ప్రాంతాల్లో కొందరు వైసీపీ నాయకులు ఏ భూమిని కూడా వదల్లేదని మరోసారి వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications