సీఎం జగన్ కు నమ్మకముంటేనే ఉంటా - ఇకపై సహించేది లేదు: వైసీపీ ఎమ్మెల్యే సంచలనం..!!
ప్రకాశం జిల్లాలో వైసీపీ నేతల అంతర్గత పోరు తారా స్థాయికి చేరుతోంది. దర్శి నియోజకవర్గ కేంద్రంగా కొద్ది రోజులుగా పార్టీలో విభేదాలు బయట పడుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి పార్టీలో చర్చకు కారణమయ్యాయి. రెండు రోజుల క్రితమే ముఖ్యమంత్రి జగన్ దర్శి నియోజకవర్గంలో పర్యటించారు. ఇప్పుడు దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేసారు. తాను ఇప్పటి వరకు నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా ఏం చేసినా భరిస్తూ వచ్చానని.. ఇక పై సహించేది లేదంటూ ఫైర్ అయ్యారు.

పార్టీ కోసం భరించాను
ఎమ్మెల్యే వేణు గోపాల్ ఇప్పటి వరకు తాను పార్టీ తాను ఇవన్నీ భరించానని చెప్పారు. నియోజకవర్గ ప్రజల కోసం మూడేళ్లుగా తన శక్తి మేర పని చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఎన్నో అవమానాలు భరించానని..తాను ఎవరి పదవీ లాక్కోలేదంటూ తనలోని అసహనాన్ని బయట పెట్టారు. అందరూ కోరితేనే తాను ఎమ్మెల్యేగా పోటీ చేశానన్నారు. దర్శిలో వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఈ వ్యాఖ్యలు చేసారు. తాను పార్టీ కోసమే పని చేస్తున్నా.. మూడేళ్లుగా నిద్ర లేకుండా చేస్తున్నారంట ఆవేదన చెందారు.

దేనికైనా సిద్దమేనంటూ హెచ్చరిక
ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా అవమానించినా తాను వాటిని భరిస్తూ వచ్చానన్నారు. ఇక మాత్రం తాను సహించేది లేదని.. దేనికైనా సిద్దమంటూ హెచ్చరించారు. తనకు వ్యతిరేకంగా సొంత పార్టీలోనే గ్రూపు రాజకీయాలు చేస్తున్నారంటూ మండి పడ్డారు. నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో ప్రోటోకాల్ కూడా పాటించటం లేదంటూ ఆవేదన చెందారు. కొందరు పార్టీ కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం తనను ఒక సామాజిక వర్గానికే పరిమితం అయ్యేలా ఆపాదిస్తున్నాంటూ చెప్పుకొచ్చారు.

సీఎంకు నమ్మకం ఉంటేనే ఉంటా..లేకుంటే
నియోజకవర్గంలో అన్ని వర్గాలు..రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కూడా తనతోనే ఉన్నారని ఎమ్మెల్యే విశ్లేషించారు. నియోజవకర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు తాను ఇల్లు ఏర్పాటు చేసుకుంటే దాని పైనా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ కు తనపై నమ్మకం ఉంటే వైసీపీలో ఉంటానని..లేకుంటే తాను వ్యక్తిగతంగా మద్దిశెట్టి వేణుగోపాల్ గానే ఉంటానంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇలా.. తనను పని చేసుకోనీయకుండా ఇబ్బంది పెట్టటం ఎంత వరకు సబబని వేణుగోపాల్ ప్రశ్నించారు. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వైసీపీలో కలకలంగా మారాయి.












Click it and Unblock the Notifications