వైసీపీకి మరో బిగ్ షాక్.. గుడ్ బై చెప్పిన మరో కీలక నేత
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకోవడమే కాకుండా నేతలంతా వరుసగా పార్టీని వీడుతుండడం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇక గత కొంతకాలంగా ఈ వలసలకు చెక్ పడిందని భావిస్తున్న తరుణంలో ఇప్పుడు వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది.
పార్టీకి చెందిన సీనియర్ నేత, శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న జకియా ఖానం తన పదవికి రాజీనామా చేశారు. అంతే కాకుండా పార్టీ సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను వ్యక్తిగత సిబ్బంది ద్వారా శాసనమండలి కార్యాలయానికి పంపించారు. జకియా ఖానం కూడా పదవికి రాజీనామా చేయడంతో వైసీపీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్సీల సంఖ్య మరొకటి పెరిగింది.

అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన జకియా ఖానం 2020 జూలైలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. ఆ తర్వాత శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అయితే గత రెండేళ్లుగా ఆమె వైసీపీ అధిష్ఠానం పట్ల అసంతృప్తిగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ కార్యక్రమాలకు సైతం ఆమె దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
ఇక ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీకి రాజీనామా చేశారు. మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ, కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత వంటి వారు పార్టీని వీడిన వారిలో ఉన్నారు. మరోవైపు గతంలో మంత్రి నారా లోకేష్‌ను జకియా ఖానం కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయనను శాలువాతో సత్కరించారు. దీంతో జకియా ఖానం టీడీపీలో చేరడం పక్కా అని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications