బీజేపీ చేసిన ఆఫర్ వద్దన్నాం; వైఎస్ షర్మిలపైనా.. విజయసాయి రెడ్డి తీవ్రవ్యాఖ్యలు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు చెక్ పెట్టాలని, ఆయన సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన షర్మిల, రాష్ట్రంలో వైసిపి పాలనకు చరమగీతం పాడాలని, ఏపీ ప్రజలకు జగనన్న చేసిందేమీ లేదని ప్రజాక్షేత్రంలో తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.
షర్మిల ఏపీ రాజకీయాలపై సాయిరెడ్డి కామెంట్స్
ఇక వైయస్ షర్మిల తీరుపై వైసీపీ నేతలు సైతం తమదైన శైలిలో మండిపడుతున్నారు. తాజాగా ఒక ఛానల్ లో ఇంటర్వ్యూలో మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వైయస్ షర్మిలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ తో షర్మిల రాజకీయంగా విభేదించిన మాట వాస్తవమేనని పేర్కొన్న ఆయన షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు తాము ఏమీ అనలేదని, కానీ ఏపీలో రాజకీయాలలోకి వచ్చి షర్మిల తప్పు చేశారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.

షర్మిల వెనుక ఉంది ఆయనే .. సాయిరెడ్డి
షర్మిల వెనుక ఎవరున్నారు అందరికీ తెలుసని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. షర్మిల వెనుక చంద్రబాబు ఉన్నారు అన్న ఉద్దేశాన్ని ఆయన తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు. ఇక ఎన్డీఏ కూటమిలో చేరే అంశం పైన కూడా కీలక వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి ఎన్డీఏలో చేరాలని వైసీపీకి 2014లోనే ఆఫర్ వచ్చిందని, మేము వద్దన్న తర్వాతే బిజెపి, టీడీపీతో జత కట్టిందని ఆయన పేర్కొన్నారు.
ఎన్డీఏలో మాకే ముందు ఆఫర్.. మేం వద్దంటేనే టీడీపీతో పొత్తు
గతంలో ఎన్డీఏకు అంశాల వారీగానే మద్దతు ఇచ్చామని, ఇప్పుడు కూడా మేము కాదు అనుకున్న తర్వాతనే టిడిపితో పొత్తు పెట్టుకున్నారని వ్యాఖ్యలు చేశారు. వైసిపి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని ఆయన స్పష్టంచేశారు. ఇక వాలంటీర్లను తమ కార్యకర్తలను తాను ఏ రోజు చెప్పలేదని, తమ ప్రభుత్వం నియమించిన వారు అనే చెప్పానని ఆయన గుర్తు చేశారు. ఇక వాలంటీర్లలో చాలామంది వైసీపీ అభిమానులుగానే ఉంటారని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications