Year Ender 2023: ఏపీలో పొత్తుల్ని ముందుకు జరిపిన ఏడాది- అయినా ఇంకెన్నో ప్రశ్నలు !
ఏపీలో ఈ ఏడాది విపక్షాలకు రాజకీయంగా కలిసొచ్చిందనే చెప్పవచ్చు. గతంలో పోలిస్తే ఏపీలో వైసీపీతో పోటీ పడే స్ధాయికి విపక్షాలు చేరుకున్నాయి. గత నాలుగేళ్లుగా కేసులు, అరెస్టుల భయంతో ఇళ్లలో నుంచి బయటికి వచ్చేందుకే జంకిన విపక్ష నాయకులు, శ్రేణులు ఈ ఏడాది మాత్రం ప్రజల్లో తిరుగుతున్నారు. అదే సమయంలో చంద్రబాబు అరెస్టు తర్వాత మారిన రాజకీయంతో టీడీపీ-జనసేన ఎన్నికలకు చాలా ముందే పొత్తు ప్రకటన చేసేశాయి. అయితే బీజేపీ కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాయి.
ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికల్లో అధికార వైసీపీని ఎదుర్కొని గట్టి పోటీ ఇవ్వాలంటే ఐక్యంగా ఉండటంతో పాటు బీజేపీ పొత్తు కూడా కావాలని టీడీపీ-జనసేన ఎప్పటి నుంచో భావిస్తున్నాయి. ఇందులో భాగంగా మూడేళ్ల క్రితమే బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారు. క్షేత్రస్దాయిలో కలిసి పనిచేయకపోయినా బీజేపీతో జనసేన పొత్తు ప్రకటనలకు మాత్రం పరిమితమైంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ఏడాది చంద్రబాబును స్కిల్ స్కాంలో అరెస్టు చేసిన జగన్.. విపక్షాలకు సవాల్ విసిరారు.

దీంతో చంద్రబాబు అరెస్టును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు టీడీపీ-జనసేన ముందస్తు పొత్తు పెట్టేసుకున్నాయి. వాస్తవానికి గతంలో ఎప్పుడూ టీడీపీ ఇంత ముందుగా పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లలేదు. అలాగని పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లలేదు. కేవలం 2019లో మాత్రమే టీడీపీ పొత్తుల్లేకుండా ఎన్నికలకు వెళ్లి దారుణంగా దెబ్బతింది. దీంతో ఈసారి జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ముందస్తుగా ఇరు పార్టీల నాయకుల్ని ఎన్నికలకు సన్నద్ధం చేసే పనిలో చంద్రబాబు-పవన్ బిజీగా ఉన్నారు.
మరోవైపు బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన ఆ పార్టీ అభిప్రాయం తీసుకోకుండానే టీడీపీతో పొత్తు పెట్టేసుకున్నారు. దీనిపై ఆగ్రహంగా ఉన్న బీజేపీ ఇప్పటివరకూ టీడీపీ-జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తామనే ప్రకటన చేయడం లేదు. ఇది టీడీపీ-జనసేనకు మైనస్ గా మారుతోంది. బీజేపీ సాయం లేకుండా ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందో చంద్రబాబు 2019 ఎన్నికల్లోనే చూశారు. దీంతో ఈసారి ఎలాగైనా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఆశించిన చంద్రబాబు.. తెలంగాణ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నా ఆ పార్టీకి మద్దతివ్వకుండా కాంగ్రెస్ కు ఓట్లు వేయించారనే అపప్రద మూటగట్టుకున్నారు. దీంతో బీజేపీ ఇప్పుడు ఏం చేయబోతోందన్నది ఏపీలో ఎన్నికల ఫలితాలను నిర్ణయించబోతోంది.












Click it and Unblock the Notifications