Year Ender 2024: ఏపీ రాజకీయాల్లో బిగ్ టర్న్-ఓడలు బండ్లయిన ఏడాది..!
ఏపీ రాజకీయాల్ని 2024 సంవత్సరం సమూలంగా మలుపు తిప్పేసింది. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల ముందు వరకూ పటిష్టంగా కనిపించిన వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీని ఒక్క ఎన్నికల్లో బలమైన కూటమి ఏర్పాటు చేసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి చిత్తు చేశాయి. గతేడాది చంద్రబాబు అరెస్టుతో మొదలైన ఈ ఎపిసోడ్ ఈ ఏడాది ఎన్నికల్లో కూటమి ఘన విజయంతో ముగిసింది. ఏపీ చరిత్రలో గతంలో జగన్ సృష్టించిన 151 సీట్ల రికార్డును ఈ ఏడాది కూటమి 164 సీట్లతో తిరగ రాసింది.
గతేడాది ఏపీ స్కిల్ స్కాంలో చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేసిన వైసీపీ సర్కార్ విజయవాడకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు పంపింది. దీంతో రాజమండ్రి జైల్లోనే 53 రోజుల పాటు ఉన్న చంద్రబాబుకు అప్పటివరకూ దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ వచ్చి మద్దతు తెలిపారు. అంతే కాదు అప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ ఎన్డీయేలోకి టీడీపీని తీసుకొచ్చి మరీ పోటీ చేయించారు. దీంతో కూటమి ప్రజల్లోకి ధీమాగా వెళ్లి ఘన విజయంతో తిరిగొచ్చి అధికారం చేపట్టింది.

కూటమి జోరుతో వైసీపీ గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా ఓటమి పాలైంది. అసెంబ్లీలో కేవలం 11 సీట్లకు పరిమితమైన వైసీపీ .. ప్రధాన విపక్షం హోదా కూడా దక్కించుకోలేకపోయింది. ఆ తర్వాత జగన్ హైకోర్టు వరకూ వెళ్లినా విపక్ష నేత హోదా మాత్రం రాలేదు. దీంతో ఆయన అసెంబ్లీకి వెళ్లడమే మానేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీతో సహా ఏపీ రాజకీయమంతా ఏకపక్షంగా సాగిపోతోంది. అలా ఈ ఏడాది ఏపీ రాజకీయాల్ని పూర్తిగా మార్చేసిందని చెప్పుకోవచ్చు. అంతే కాదు ప్రజలు ఆదరిస్తే ఏ స్ధాయిలో ఉంటుందో మరోసారి చాటి చెప్పిన ఏడాది కూడా ఇదే.












Click it and Unblock the Notifications