Year Ender 2025: జగన్ లో ఈ ఏడాది తెచ్చిన మార్పు..ప్లస్సా ? మైనస్సా ?
గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీని తిరిగి ఐదేళ్లలో అధికారంలోకి తీసుకురావాల్సిన పరిస్ధితుల్లో అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఏడాదిని ప్రారంభించారు. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అధికారం కోల్పోగానే రెండు, మూడేళ్ల పాటు హైదరాబాద్ కే పరిమితమైన పరిస్ధితుల్లో జగన్ ఏం చేయబోతున్నారే చర్చ ఓవైపు, అసెంబ్లీలో విపక్ష నేత పదవి కోసం పట్టుబట్టి కోర్టుల వరకూ వెళ్లడం మరోవైపు, జనంలో విస్తృతంగా తిరుగుతూ ఉనికి కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఇంకోవైపు జగన్ పేరును ఈ ఏడాది కాలంలో వినిపించేలా చేశాయి.
గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత విపక్షంలో ఉన్న ఏకైక పార్టీగా వైసీపీకి విపక్ష పార్టీగా గుర్తింపు ఇవ్వాలని, తనకు విపక్ష నేత హోదా ఇవ్వాలని జగన్ ఈ ఏడాది కూడా పట్టువదలకుండా ప్రయత్నాలు చేశారు. స్పీకర్ కు లేఖలు రాయడంతో పాటు హైకోర్టు వరకూ వెళ్లారు. అయినా ఫలితం మాత్రం దక్కలేదు. విపక్ష నేత హోదా దక్కకపోయినా పరోక్షంగా దాంతో చేయాల్సిన పనులన్నీ జగన్ చేసేస్తున్నారు. రాష్ట్రంలో అధికార కూటమి వైఫల్యాల్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్తూ ఎండగడుతున్నారు.

మరోవైపు జగన్ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ప్రెస్ మీట్లు పెడుతూ మీడియా ద్వారా ప్రజలకు తన గొంతు వినిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. తద్వారా అసెంబ్లీ ద్వారా మిస్సవుతున్న తన వాణిని అలా వినిపిస్తున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో రైతు సమస్యలపై జగన్ ఈసారి విస్తృతంగా పర్యటనలు చేశారు. ఈ టూర్లకు జనం స్పందన కూడా భారీగా వచ్చింది. అయితే ఈ పర్యటనల్లో పలుమార్లు పోలీసుల వైఫల్యంతో పలు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. అయినా జనంలో జగన్ క్రేజ్ తగ్గేలేదని నిరూపణ అయింది.

అదే సమయంలో జగన్ పూర్తిస్దాయిలో తాడేపల్లి నివాసంలో ఉంటూ వైసీపీ నేతలకు అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. తాజాగా విదేశాలకు కూడా వెళ్లివచ్చారు. వారంలో మూడు, నాలుగు రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉంటూ మిగతా రోజులు బెంగళూరు నివాసంలో ఆయన గడుపుతున్నారు. అయితే పార్టీ నేతలకు విస్తృతంగా పదవుల పంపకాలు చేస్తున్నారు. అలాగే తాను విదేశాల్లో ఉన్నా పార్టీ నేతలు ప్రజాక్షేత్రంలో ఉంటూ పోరాటాలు చేసే స్ధాయికి జగన్ తీసుకొచ్చారు. దీంతో జగన్ ఉంటేనే పార్టీ యాక్టివ్ గా ఉంటుందన్న ముద్రను సైతం చెరిపేశారు. మెడికల్ కాలేజీలు, కల్తీ మద్యం, రైతు సమస్యలపై జగన్ పిలుపుతో క్షేత్రస్ధాయిలో వైసీపీ చేసిన పోరాటాలు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాయి. అలా జగన్ పోరాటాలతో ఈ ఏడాది గడిచిపోయింది.












Click it and Unblock the Notifications